Vankaya Mudda Vepudu : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో వంకాయలు కూడా ఒకటి. వంకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో రకరకాల వేపుళ్లు, కూరలు తయారు చేస్తూ ఉంటాము. వంకాయలతో చేసుకోదగిన రుచికరమైన వెరైటీ వేపుళ్లల్లో వంకాయ ముద్ద వేపుడు కూడా ఒకటి. వంకాయలు, పచ్చి బఠాణీ కలిపి చేసే ఈ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. ఎవరైన దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. వంకాయలను తినని వారు కూడా ఈ వేపుడును ఇష్టంగా తింటారు. ఎంతో రుచిగా, కమ్మగా వెరైటీగా ఉండే ఈ వంకాయ ముద్ద వేపుడును ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వంకాయ ముద్ద వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చి కొబ్బరి ముక్కలు – పావు కప్పు, పచ్చిమిర్చి – 6 లేదా కారానికి తగినన్ని, వంకాయలు – పావుకిలో, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, తరిగిన ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు, కరివేపాకు – ఒక రెమ్మ, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, పచ్చి బఠాణీ – పావు కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
వంకాయ ముద్ద వేపుడు తయారీ విధానం..
ముందుగా జార్ లో పచ్చికొబ్బరి, పచ్చిమిర్చి వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. తరువాత వంకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి వేసి కలపాలి. తరువాత వంకాయ ముక్కలు, పచ్చిబఠాణీ వేసి కలపాలి.
తరువాత వీటిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వంకాయ ముక్కలను పూర్తిగా వేయించాలి. వంకాయ ముక్కలు చక్కగా వేగిన తరువాత మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి వేసి కలపాలి. తరువాత మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు వేయించాలి. చివరగా కొత్తిమీరను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ ముద్ద వేపుడు తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే పప్పు, సాంబార్, రసం వంటి వాటితో సైడ్ డిష్ గా కూడా తినవచ్చు. వంకాయలతో తరుచూ చేసే వంటకాలతో పాటు ఇలా కూడా తయారు చేసుకుని తినవచ్చు. దీనిని కూడా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.