Masala Bonda Recipe : మసాలా బోండా.. ఈ బోండాలు చాలా రుచిగా ఉంటాయి. పైన క్రిస్పీగా, లోపల మెత్తగా తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటాయి. వీటిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. అయితే బోండా అనగానే నూనెలో వేయించి మాత్రమే తయారు చేస్తారు అని అనుకుంటారు. కానీ ఈ బోండాలను చాలా తక్కువ నూనెతో కూడా తయారు చేసుకోవచ్చు. తక్కువ నూనె వాడినప్పటికి ఈ బోండాలు చాలా క్రిస్పీగా ఉంటాయి. అల్పాహారంగా లేదా స్నాక్స్ గా వీటిని తీసుకోవచ్చు. రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేసేలా తక్కువ నూనెతో ఈ మసాలా బోండాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మసాలా బోండా తయారీకి కావల్సిన పదార్థాలు..
వేడి నీళ్లు – 250 ఎమ్ ఎల్, బియ్యంపిండి – ఉప్పు – తగినంత, జీలకర్ర – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – ఒక టేబుల్ స్పూన్, మిరియాల పొడి – పావు టీ స్పూన్.
మసాలా తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2టేబుల్ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, క్యారెట్ తురుము – అర కప్పు, ఉడికించిన బంగాళాదుంప – పెద్దది ఒకటి, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, మిరియాల పొడి – అర టీస్పూన్, కారం – అర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నిమ్మరసం – అర చెక్క.
మసాలా బోండా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బియ్యంపిండి, ఉప్పు, జీలకర్ర, మిరియాల పొడి, కొత్తిమీర వేసి కలపాలి. తరువాత కొద్ది కొద్దిగా వేడి నీటిని పోస్తూ స్పూన్ తో అంతా కలిసేలా కలుపుకోవాలి. తరువాత దీని మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో మసాలా కోసం నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత క్యారెట్ తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి.వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత ఉడికించిన బంగాళాదుంపను మెత్తగా చేసి వేసుకోవాలి. దీనిని మరో 2 నుండి 3 నిమిషాల పాటు వేయించిన తరువాత మిగిలిన పదార్థాల్నీ వేసి బాగా కలుపుకోవాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత ఈ మసాలా మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు ముందుగా కలిపిన పిండిని చేత్తో అంతా కలిసేలా చపాతీ పిండిలా కలుపుకోవాలి.
పిండి గట్టిగా ఉంటే నీటిని పోసి కలుపుకోవాలి. మెత్తగా ఉండే పొడి పిండి వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత నిమ్మకాయంత పిండిని తీసుకుని పొడి పిండి చల్లుకుంటూ పూరీలాగా వత్తుకోవాలి. తరువాత ఇందులో మసాలా ఉండను ఉంచి అంచులను మూసేసి బోండాలాగా గుండ్రంగా చేసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత పొంగనాల గిన్నెను తీసుకుని అందులో నూనె వేసి వేడి చేయాలి. తరువాత బోండాలను ఉంచి వేయించాలి. వీటిని అటూ ఇటూ తిప్పుతూ చుట్టూ ఎర్రగా, క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. లేదంటే కళాయిలో నూనె వేసి అందులో బోండాలను వేసి షాలో ఫ్రై చేసి కూడా తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మసాలా బోండాలు తయారవుతాయి. వీటిని చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా కూడా మసాలా బోండాలను తయారు చేసుకుని తినవచ్చు.