Chakra Banalu : మనం రవ్వతో రకరకాల చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాము. రవ్వతో చేసుకోదగిన చిరుతిళ్లల్లో చక్ర బాణాలు కూడా ఒకటి. చక్ర బాణాలు చాలా రుచిగా, గుల్ల గుల్లగా ఉంటాయి. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. అలాగే వీటిని చాలా సులభంగా కేవలం అరగంటలోనే తయారు చేసుకోవచ్చు. అందరికి ఎంతగానో నచ్చే ఈ చక్రబాణాలను రుచిగా, కరకరలాడుతూ ఉండేలా ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చక్ర బాణాల తయారీకి కావల్సిన పదార్థాలు..
రవ్వ – 2 కప్పులు, ఉప్పు – తగినంత, చిల్లీ ప్లేక్స్ – 2 టీ స్పూన్స్, వాము – ఒక టీ స్పూన్, తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
చక్ర బాణాల తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో రవ్వ వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, చిల్లీ ప్లేక్స్, వాము, తరిగిన కరివేపాకు వేసి కలపాలి. తరువాత 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ బాగా వత్తుతూ పూరీ పిండిలా కలుపుకోవాలి. తరువాత దీని మూత పెట్టి పావు గంట పాటు పక్కకు ఉంచాలి. తరువాత పిండిని తీసుకుని పొడి పిండి చల్లుకుంటూ చపాతీలా వత్తుకోవాలి. తరువాత చాకుతో ఈ చపాతీని డైమండం ఆకారంలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఈ ముక్కలను తీసి నూనెలో వేసుకోవాలి. తరువాత వీటిని మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా, కరకరలాడుతూ ఉండే చక్ర బాణాలు తయారవుతాయి. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల చాలా కాలం పాటు మెత్తబడకుండా తాజాగా ఉంటాయి. వీటిని పిల్లలు మరింత ఇష్టంగా తింటారు.