Lemon Coriander Soup : లెమన్ కొరియాండర్ సూప్.. కొత్తిమీర, నిమ్మరసం వేసి చేసే ఈ సూప్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చయడం చాలా సులభం. ఒక్కసారి ఈ సూప్ ను రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, జలుబు, దగ్గు, ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్నప్పుడు, బరువు తగ్గాలనుకునే వారు ఈ సూప్ ను తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఆకలి వేయనప్పుడు, ఏం తినాలనిపించనప్పుడు ఇలా సూప్ ను తయారు చేసుకుని తాగవచ్చు. సులభంగా, రుచిగా, కమ్మగా లెమన్ కొరియాండర్ సూప్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
లెమన్ కొరియాండర్ సూప్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన బీన్స్ ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, నీళ్లు – అర లీటర్, మిరియాల పొడి – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, కార్న్ ఫ్లోర్ – 2 టీ స్పూన్స్, సన్నగా తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, నిమ్మరసం – అర చెక్క.
లెమన్ కొరియాండర్ సూప్ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో కార్న్ ఫ్లోర్ ను తీసుకుని తగినన్ని నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత గిన్నెలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత జీలకర్ర వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు వేసి 4 నిమిషాల పాటు వేయించాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. ఇందులోనే ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. తరువాత బీన్స్, క్యారెట్ ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. ముక్కలు మెత్తగా ఉడికిన తరువాత కార్న్ ఫ్లోర్ వేసి కలపాలి. తరువాత కొత్తిమీర వేసి కలిపి మరో 3 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత నిమ్మరసం వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే లెమన్ కొరియాండర్ సూప్ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తాగుతారు.