Rice Papads : మనం బియ్యంపిండితో రకరకాల పిండి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బియ్యంపిండితో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో రైస్ పాపడ్స్ కూడా ఒకటి. రైస్ పాపడ్స్ చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. రైస్ పాపడ్స్ ను ఎవరైనా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వీటిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. కేవలం అరగంటలోనే ఈ రైస్ పాపడ్స్ ను క్రిస్పీగా, రుచిగా, తేలికగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రైస్ పాపడ్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నీళ్లు – ఒక కప్పు, బటర్ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, చిల్లీ ఫ్లేక్స్ – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, బియ్యంపిండి – ఒక కప్పు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
రైస్ పాపడ్స్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నీళ్లు, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, జీలకర్ర వేసి నీటిని మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత బియ్యంపిండి వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని 10 నిమిషాల పాటు అలాగే ఉంచిన తరువాత మూత తీసి చేతికి నీటితో తడి చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత కొద్దిగా పిండిని తీసుకుని మిగిలిన పిండిపై మూత పెట్టి పక్కకు ఉంచాలి. తరువాత తీసుకున్న పిండిని చేత్తో సిలిండర్ ఆకారంలో వత్తుకోవాలి. తరువాత చాకుతో పిండిని అర ఇంచు మందంలో ముక్కలుగా కట్ చేసుకోవాలి.
తరువాత రెండు వేళ్లతో కట్ చేసుకున్న ముక్కలను కొద్దిగా వత్తుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పాపడ్స్ ను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే రైస్ పాపడ్స్ తయారవుతాయి. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల చాలా కాలం పాటు తాజాగా ఉంటాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.