Pudina Rice : మనం సులభంగా చేసుకోదగిన వివిధ రకాల రైస్ వెరైటీలల్లో పుదీనా రైస్ కూడా ఒకటి. పుదీనా రైస్ చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి అలాగే సమయం తక్కువగా ఉన్నప్పుడు చేసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. దీనిని వివిధ రకాలుగా తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా తయారు చేసే పుదీనా రైస్ కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని అందరూ ఇష్టపడతారు. ఎంతో రుచిగా ఉండే ఈ పుదీనా రైస్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పుదీనా రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
అన్నం – ఒకటిన్నర కప్పు, పుదీనా – చిన్నవి రెండు, కొత్తిమీర – గుప్పెడు, పచ్చిమిర్చి – 3, దాల్చిన చెక్క – అర ఇంచు ముక్క, లవంగాలు – 4, వెల్లుల్లి రెబ్బలు – 8, అల్లం – ఒక ఇంచు ముక్క, నూనె – 2 టేబుల్ స్పూన్స్, బిర్యానీఆకు – 1, పల్లీలు – గుప్పెడు, జీడిపప్పు – కొద్దిగా, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, తరిగిన పచ్చిమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత.
పుదీనా రైస్ తయారీ విధానం..
ముందుగా జార్ లో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, లవంగాలు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత బిర్యానీ ఆకు, పల్లీలు వేసి వేయించాలి. తరువాత జీడిపప్పు వేసి వేయించాలి. తరువాత తాళింపు దినుసులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత కరివేపాకు వేసి వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్, ఉప్పు వేసి వేయించాలి. దీనిని పచ్చి వాసన పోయే వరకు చక్కగా వేయించిన తరువాత అన్నం వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత మూత పెట్టి ఒక నిమిషం పాటు అలాగే ఉంచాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పుదీనా రైస్ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా పుదీనాతో అప్పటికప్పుడు ఎంతో రుచికరమైన రైస్ ను తయారు చేసుకుని తినవచ్చు.