Paneer Chapati : పనీర్ చపాతీ.. పనీర్ తో చేసే ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. స్నాక్స్ గా తీసుకోవడానికి, లంచ్ బాక్స్ లోకి, అల్పాహారంగా తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. పిల్లలు దీనిని ఎంతో ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. పనీర్ తో తరుచూ చేసే వంటకాలతో పాటు ఇలా వెరైటీగా కూడా తయారు చేసుకుని తినవచ్చు. రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ పనీర్ చపాతీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పనీర్ చపాతీ తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమపిండి -ఒక కప్పు, ఉప్పు – అర టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, చిన్నగాతరిగిన ఉల్లిపాయ – 1, క్యారెట్ తురుము – చిన్నది ఒకటి, చిన్నగా తరిగిన క్యాప్సికం – చిన్నది ఒకటి, తరిగిన చిన్న టమాట – 1, షజ్వాన్ సాస్ – ఒక టేబుల్ స్పూన్, వెనిగర్ – ఒక టీ స్పూన్, టమాట కిచప్ – ఒక టేబుల్ స్పూన్, పనీర్ ముక్కలు – 150 గ్రా., కారం – పావు టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, చీజ్ తురుము – ఒక కప్పు.
పనీర్ చపాతీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండిని, ఉప్పును వేసి కలపాలి. తరువాత నీటిని పోస్తూ పిండిని కలుపుకోవాలి. తరువాత పిండిని చక్కగా కలుపుకున్న తరువాత మరో 2 నిమిషాల పాటు నొక్కుతూ బాగా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించాలి. తరువాత క్యారెట్ తురుము, క్యాప్సికం ముక్కలు వేసి వేయించాలి. వీటిని మెత్తబడే వరకు వేయించిన తరువాత షజ్వాన్ సాస్, వెనిగర్, టమాట కిచప్ వేసి కలపాలి. తరువాత పనీర్ ముక్కలు, కారం వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి ఒకటి లేదా రెండు నిమిషాల పాటు ఉంచాలి. తరువాత గరం మసాలా వేసికలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత దీనిని పక్కకు ఉంచి ముందుగా కలిపిన పిండిని ఉండలుగా చేసుకోవాలి.
తరువాత ఒక్కో ఉండను తీసుకుంటూ పొడి పిండి చల్లుకుంటూ చపాతీలా వత్తుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత ఒక్కో చపాతీని పెనం మీద వేసి కాల్చుకోవాలి. నూనె వేస్తూ రెండు వైపులా చపాతీని కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు కాల్చుకున్న చపాతీని తీసుకుని దాని మధ్యలో పనీర్ మిశ్రమాన్ని ఉంచి పై నుండి చీజ్ ను వేసుకోవాలి. తరువాత చపాతీని మడిచి మరలా పెనం మీద వేసి చీజ్ కరిగే వరకు రెండు వైపులా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పనీర్ చపాతీ తయారవుతుంది. దీనిని తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా మేలు కలుగుతుంది.