Pala Pulao : పాల పులావ్.. పాలు పోసి చేసే ఈ పులావ్ చాలా రుచిగా, కమ్మగా ఉంటుంది. ఒక్కసారి దీనిని రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. వెజ, నాన్ వెజ్ కూరలు, మసాలా కూరలు దేనితో తిన్నా కూడా ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. వెరైటీ రుచులు కోరుకనే వారు దీనిని తప్పకుండా ట్రై చేయాల్సిందే. ఎంతో కమ్మగా ఉండే ఈ పాలపులావ్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలన ఇప్పుడు తెలుసుకుందాం.
పాల పులావ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 3 టేబుల్ స్పూన్స్, పొడవుగా, సన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, లవంగాలు – 5, మిరియాలు – ఒక టీ స్పూన్, యాలకులు – 4, జాపత్రి – 1, మరాఠీ మొగ్గలు – చిన్నవి 3, అనాస పువ్వ – 1, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, బిర్యానీ ఆకు – 1, తరిగిన పచ్చిమిర్చి – 4, జీడిపప్పు – కొద్దిగా, నీళ్లు – రెండు కప్పులు, ఉప్పు – తగినంత, అరగంట పాటు నానబెట్టిన బాస్మతీబియ్యం – 2 కప్పులు, కాచిన పాలు – ఒక కప్పు, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్.
పాల పులావ్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే నూనెలో మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, జీడిపప్పు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత నీళ్లు, ఉప్పు వేసి కలపాలి. నీళ్లు మరిగిన తరువాత బియ్యం వేసి కలపాలి. తరువాత పాలు పోసి 5 నిమిషాల పాటు ఉడికించాలి.తరువాత దీనిపై నెయ్యి, ఫ్రైడ్ ఆనియన్స్ చల్లుకోవాలి. అలాగే కుంకుమ పువ్వు నీళ్లు లేదా, ఫుడ్ కలర్ వేసుకుని మూత పెట్టాలి. తరువాత స్టవ్ మీద పెనాని ఉంచి దానిపై కళాయిని ఉంచి చిన్న మంటపై 10 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి మరో 10నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పాల పులావ్ తయారవుతుంది. దీనిని ఏ కర్రీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది.