Vankaya Nuvvula Kura : మనం వంకాయలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వంకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వంకాయలతో చేసే కూరలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు. వంకాయలతో చేసుకోదగిన రుచికరమైన కూరలల్లో వంకాయ నువ్వుల కూర కూడా ఒకటి. నువ్వులు వేసి చేసే ఈ వంకాయ కూర ఎంతో కమ్మగా ఉంటుంది. వంకాయలను ఇష్టపడని వారు కూడా ఈ కూరను ఇష్టంగా తింటారు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. మన ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయలతో కమ్మగా నువ్వుల కూరను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వంకాయ నువ్వుల కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
నువ్వులు – పావు కప్పు, వెల్లుల్లి రెబ్బలు – 4, ఎండుమిర్చి – 10, నూనె – పావు కప్పు, జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, కరివేపాకు – రెండు రెమ్మలు, తరిగిన లేత పొడవు వంకాయ ముక్కలు – అరకిలో, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, నీళ్లు – పావు కప్పు, చింతపండు – రసం – పావు కప్పు, కారం – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్.
వంకాయ నువ్వుల కూర తయారీ విధానం..
ముందుగా కళాయిలో నువ్వులు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని తగినన్ని నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత వంకాయ ముక్కలు, ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసికలపాలి. తరువాత వీటిపై మూత పెట్టి సగానికి పైగావేయించాలి. వంకాయ ముక్కలు వేగిన తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్, నీళ్లు పోసి కలపాలి. తరువాత మూత పెట్టి నూనె పైకి తేలే వరకు వేయించాలి. తరువాత చింతపండు రసం, కారం వేసి కలపాలి. ఇప్పుడు మరలా మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించి కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ నువ్వుల కూర తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. వంకాయలతో తరుచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా కూడా తయారు చేసి తీసుకోవచ్చు.