How To Use Coconut Oil : జుట్టు సంరక్షణ కోసం మనం అనేక చర్యలు చేపడుతూ ఉంటాము. జుట్టు ఆరోగ్యంగా, పొడవుగా పెరగడానికి మనం తీసుకునే వివిధ రకాల చర్యలల్లో జుట్టుకు కొబ్బరి నూనె రాసుకోవడం కూడా ఒకటి. ఎంతో కాలంగా మనం జుట్టుకు కొబ్బరి నూనెను రాసుకుంటూ ఉంటాము. కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల మన జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు తెల్లబడకుండా ఉంటుంది. కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల జుట్టు, తల చర్మం పొడిబారకుండా ఉంటాయి. జుట్టు దెబ్బతినకుండా ఉంటుంది. అయితే కొబ్బరి నూనెను నేరుగా రాసుకోవడానికి బదులుగా ఈ నూనెను కొద్దిగా వేడి చేసి జుట్టుకు రాసుకోవడం వల్ల మనకు మరింత మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
గోరు వెచ్చని కొబ్బరి నూనెను రాసుకోవడం వల్ల జుట్టు పొడిబారడం మరింతగా తగ్గుతుంది. చుండ్రు సమస్య, వెంట్రుకల చివర్లు చిట్లడం వంటి సమస్యలు తగ్గుతాయి. జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణ ఎక్కువగా జరుగుతుంది. జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరుగుతుంది. అయితే ఈ గరు వెచ్చని కొబ్బరి నూనెను జుట్టుకు ఎలా రాసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం మన జుట్టును షాంపుతో శుభ్రంగా కడగాలి. జుట్టును నీటితో శుభ్రం చేయడం వల్ల నూనె జుట్టు కుదుళ్లల్లోకి సులభంగా వెళ్తుంది. జుట్టును శుభ్రం చేసిన తరువాత మన జుట్టుకు అవసరమయ్యేంత నూనెను తీసుకుని గోరు వెచ్చగా వేడి చేయాలి. తరువాత జుట్టును చిక్కులు లేకుండా చక్కగా దువ్వుకోవాలి.
తరువాత గోరు వెచ్చగా చేసిన నూనెను జుట్టు కుదుళ్లల్లోకి ఇంకేలా రాస్తూ మర్దనా చేయాలి. దీనిని అరగంట నుండి గంట పాటు అలాగే ఉంచి ఆ తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్లకు కావల్సిన పోషకాలు చక్కగా అందుతాయి. జుట్టు కుదుళ్లు బలంగా, ఆరోగ్యంగా తయారవుతాయి. జుట్టు పొడిబారడం తగ్గడంతో పాటు జుట్టు సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఈ విధంగా సాధారణ కొబ్బరి నూనెకు బదులుగా గోరు వెచ్చని కొబ్బరి నూనెను రాసుకోవడం వల్ల మనం మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.