Guava Leaves For Hair : నేటి తరుణంలో మనలో చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యతో బాధపడుతున్నారు. తల చర్మం లోపలి పొరల్లో ఉండే కొల్లాజెన్ దెబ్బతినడం వల్ల జుట్టు కుదుళ్లు బలహీన పడతున్నాయి. దీంతో జుట్టు ఎక్కువగా రాలుతుంది. జుట్టు ఎక్కువగా రాలడానికి గల కారణాల్లో ఇది కూడా ఒకటి. జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవడానికి జుట్టును ఒత్తుగా, పొడవుగా పెంచుకోవడానికి చాలా మంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎంతో ఖరీదైన షాంపులను, నూనెలను వాడుతూ ఉంటారు. అయితే వీటిలో ఉండే రసాయనాల కారణంగా జుట్టు మరింతగా ఊడిపోతుంది తప్ప ఎటువంటి ఫలితం ఉండదు. కానీ ఒక చిన్న చిట్కాను వాడడం వల్ల మనం చాలా సులభంగా జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. ఈ చిట్కాను తయారు చేయడం చాలా సులభం.
దీనిని తయారు చేసుకోవడానికి మనం ఒకే ఒక పదార్థాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. అదేమిటో కాదు జామాకులు. మనందరం జామపండ్లు మాత్రమే మన ఆరోగ్యానికి మేలు చేస్తాయని భావిస్తాము. కానీ జామాకులల్లో కూడా ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. మన జుట్టు ఆరోగ్యానికి కూడా జామాకులు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేయడంలో దోహదపడుతుంది. అలాగే వీటిలో లైకోపిన్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది. ఇది ఎండ నుండి జుట్టును కాపాడడంలో మనకు దోహదపడుతుంది. అయితే జుట్టు రాలే సమస్యతో బాధపడే వారు ఈ జామాకులను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. జుట్టు రాలే సమస్యతో బాధపడే వారు ముందుగా జామాకులను శుభ్రంగా కడిగి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పట్టించాలి.
దీనిని ఒక గంట పాటు అలాగే ఉంచి ఆ తరువాత కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. అలాగే జామాకుల కషాయాన్ని వాడడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. నీటిలో శుభ్రంగా కడిగిన 5 నుండి 7 జామాకులను వేసి బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిని చల్లారే వరకు అలాగే ఉంచి ఆ తరువాత వడకట్టాలి. తరువాత ఈ కషాయాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి కుదుళ్లల్లోకి ఇంకేలా మర్దనా చేసుకోవాలి. ఒక గంట తరువాత కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు సమస్యలు తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఈ విధంగా రసాయనాలు కలిగిన ఖరీదైన షాంపులను వాడడానికి బదులుగా మనకు సహజంగా లభించే జామాకులను వాడడం వల్ల మనం జుట్టు రాలడాన్ని చాలా సులభంగా తగ్గించుకోవచ్చు.