Tomato Bajji : టమాట బజ్జీ.. మనకు సాయంత్రం సమయంలో బండ్ల మీద లభించే చిరుతిళ్లల్లో ఇవి కూడా ఒకటి. టమాట బజ్జీలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. టమాట బజ్జీలను అదే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. స్నాక్స్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఈ టమాట బజ్జీలను ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. స్ట్రీట్ స్టైల్ లో టమాట బజ్జీలను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట బజ్జీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, మందంగా ఉండే అటుకులు -ఒక కప్పు, కార్న్ ఫ్లేక్స్ – ఒక కప్పు, శనగపిండి – ముప్పావుకప్పు, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, వాము పొడి – అర టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, వంటసోడా – పావు టీ స్పూన్, కసూరిమెంతి – ఒక టేబుల్ స్పూన్, టమాటాలు – 6 ( మధ్యస్థంగా ఉన్నవి), చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, కారం – అర టీ స్పూన్, చాట్ మసాలా – అర టీ స్పూన్, నిమ్మరసం – కొద్దిగా.
టమాట బజ్జీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అటుకులు వేసి వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే నూనెలో కార్న్ ఫ్లేక్స్ వేసి వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత గిన్నెలో శనగపిండిని తీసుకోవాలి. ఇందులో ఉప్పు, పసుపు, వాము పొడి, ధనియాల పొడి, వంటసోడా వేసి కలపాలి. తరువాత నీళ్లు పోస్తూ బజ్జీ పిండిలా కలుపుకోవాలి. తరువాత ఈ పిండిని 2 నుండి 3 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. తరువాత ఇందులో కసూరిమెంతి వేసి కలపాలి. ఇప్పుడు టమాటాలను తడి లేకుండా తుడుచుకోవాలి. తరువాత వీటిని పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి. ఈ బజ్జీలు వేగిన తరువాత ప్లేట్ లోకి తీసుకోవాలి. వీటిని మరలా పిండిలో ముంచి మరలా నూనెలో వేసుకోవాలి. ఇలా రెండుసార్లు వేసిన తరువాత ఈ బజ్జీలను ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి.
తరువాత ఈ బజ్జీని తీసుకుని దానిని మధ్యలోకి కట్ చేసుకోవాలి. తరువాత లోపల ఉండే టమాటాను తీసి వేయాలి. ఈ టమాటాలను ఒక్క గిన్నెలోకి తీసుకుని అందులో పావు కప్పు వేయించిన అటుకులు, కార్న్ ఫ్లేక్స్, 2 టేబుల్ స్పూన్స్ ఉల్లిపాయ ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర, కారం, చాట్ మసాలా, ఉప్పు, నిమ్మరసం వేసి చేత్తో కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని టమాటాను తీసి వేయగా మిగిలిన బజ్జీలో స్టప్ చేసుకోవాలి. తరువాత పై నుండి కొద్దిగా కార్న్ ఫ్లేక్స్, వేయించిన పల్లీలు, కొత్తిమీర, ఉప్పు, కారం, నిమ్మరసం చల్లుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట బజ్జీ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.