Sorakaya Pappu : మన ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయలల్లో సొరకాయ కూడా ఒకటి. సొరకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, బరువు తగ్గడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, శరీరానికి చలువ చేయడంలో ఇలాఅనేక రకాలుగా సొరకాయ మనకు మేలు చేస్తుంది. సొరకాయతో చేసుకోదగిన వంటకాల్లో సొరకాయ పప్పు కూడా ఒకటి. సొరకాయ పప్పు చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఈ పప్పును అందర ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. సొరకాయతో రుచికరమైన పప్పును ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సొరకాయ పప్పు తయారీకి కావల్సిన పదార్థాలు..
సొరకాయ – చిన్నది ఒకటి, నానబెట్టిన కందిపప్పు – అరకప్పు, పచ్చిమిర్చి – 10 నుండి 15, తరిగిన టమాటాలు – 3, పసుపు – పావు టీ స్పూన్, నీళ్లు – ఒక గ్లాస్, చింతపండు – చిన్న నిమ్మకాయంత, ఉప్పు – తగినంత.
తాళింపుకు కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, ఎండుమిర్చి – 3, తరిగిన ఉల్లిపాయ – 1, కరివేపాకు – ఒక రెమ్మ.
సొరకాయ పప్పు తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో పప్పును వేసుకోవాలి. తరువాత సొరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాట ముక్కలు, పసుపు, నీళ్లు వేసుకోవాలి. తరువాత చింతపండు వేసి మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మూత తీసి ఇందులో ఉప్పు వేసి పప్పును మెత్తగా చేసుకోవాలి. తరువాత తాళింపుకు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత దంచిన వెల్లుల్లి రెబ్బలు,ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత పప్పు వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి మరో 3 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సొరకాయ పప్పు తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా సొరకాయతో పప్పును తయారు చేసి తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.