Chikkudukaya Nilva Pachadi : మనం పచ్చడి చేసుకోవడానికి వీలుగా ఉండే కూరగాయల్లో చిక్కుడుకాయలు కూడా ఒకటి. చిక్కుడుకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చిక్కుడుకాయలతో చేసే కూరలు చాలా రుచిగా ఉంటాయి. కూరలతో పాటు చిక్కుడుకాయలతో మనం నిల్వ పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పచ్చడిని తయారు చేయడం చాలా సులభం. సరిగ్గా చేయాలే కానీ ఈ పచ్చడి ఆవకాయ కంటే చాలా రుచిగా ఉంటుంది. చిక్కుడుకాయలతో చాలా సులభంగా పక్కా కొలతలతో నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చిక్కుడుకాయ నిల్వ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
ఆవాలు – 3 టేబుల్ స్పూన్స్, మెంతులు -ఒక టేబుల్ స్పూన్, చిన్న చిక్కుడుకాయలు – అరకిలో, నానబెట్టిన కొత్త చింతపండు – 125 గ్రా., పల్లీల నూనె లేదా నువ్వుల నూనె – ఒక కప్పు, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 5 లేదా 6, కరివేపాకు – ఒక రెమ్మ, వెల్లుల్లి రెబ్బలు – పావు కప్పు, ఇంగువ – అర టీ స్పూన్, కారం – ముప్పావు కప్పు, ఉప్పు – పావు కప్పు, పసుపు – అర టీ స్పూన్.
చిక్కుడుకాయ నిల్వ పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో ఆవాలు, మెంతులు వేసి వేయించాలి. తరువాత వీటిని పొడిగా చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత చిక్కుడుకాయలను శుభ్రంగా కడిగి తడి పోయేలా అరగంట పాటు ఆరబెట్టాలి. తరువాత చిక్కుడుకాయలకు ఉండే తొడిమలు తేసేసి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చిక్కుడుకాయలను వేసి వేయించాలి. వీటిని 5 నిమిషాల పాటు వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే నూనెలో 2 టీ స్పూన్ల ఆవాలు, జీలకర్ర, చిటికెడు మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత దీనిని చిక్కుడుకాయల్లో వేసుకోవాలి.
తరువాత అదే కళాయిలో 100 ఎమ్ ఎల్ నీళ్లు పోసి వేడి చేయాలి. తరువాత చింతపండు గుజ్జు వేసి కలపాలి. దీనిని దగ్గర పడి నూనె పైకి తేలే వరకు ఉడికించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని కూడా చిక్కుడుకాయల్లో వేసి కలుపుకోవాలి. తరువాత ఉప్పు, కారం, పసుపు, మిక్సీ పట్టుకున్న ఆవాల పిండి వేసి కలపాలి. ఈ పచ్చడిని ఒక రోజంతా ఊరబెట్టిన తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చిక్కుడుకాయ నిల్వ పచ్చడి తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో తింటే చాలా రుచిగా ఉంటుంది.