Masala Kajjikayalu : మసాలా కజ్జికాయలు.. టీ తాగుతూ స్నాక్స్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. పైన క్రిస్పీగా లోపల రుచికరమైన స్టఫింగ్ తో ఈ కజ్జికాయలు చాలా రుచిగా ఉంటాయి. తీపి కజ్జి కాయలను ఎక్కువగా ఇష్టపడని వారు ఇలా మసాలా కజ్జికాయలను తయారు చేసి తీసుకోవచ్చు. స్నాక్స్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. వీటిని తయారు చేయడం చాలా సులభం. క్రిస్పీగా, రుచిగా ఉండే ఈ మసాలా కజ్జికాయలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మసాలా కజ్జికాయల తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదాపిండి – ఒక కప్పు, ఉప్పు – కొద్దిగా వాము – అర టీ స్పూన్, వేడి నూనె – 3 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
స్టఫింగ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, క్యారెట్ తురుము – అర కప్పు, చిన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలు – అర కప్పు, ఉప్పు – కొద్దిగా, పసుపు – చిటికెడు, ధనియాల పొడి – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, ఆమ్ చూర్ పొడి – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – పావు టీ స్పూన్, బ్లాక్ సాల్ట్ – పావు టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, చాట్ మసాలా – పావు టీ స్పూన్, ఉడికించిన బంగాళాదుంపలు – 2, ఉడికించిన బఠాణీ – అర కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మసాలా కజ్జికాయల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి. తరువాత ఉప్పు, వాము వేసి కలపాలి. తరువాత వేడి నూనె వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత స్టఫింగ్ కోసం కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, క్యాప్సికం, క్యారెట్ తురుము వేసి కలపాలి. ఇవన్నీ వేగిన తరువాత పసుపు, ఉప్పు వేసి కలపాలి. తరువాత మిగిలిన పొడులన్నీ వేసి కలపాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత బంగాళాదుంపలను మెత్తగా చేసి వేసుకోవాలి. అలాగే బఠాణీలను కూడా వేసుకోవాలి. వీటిలో ఉండే తడి అంతా పోయే వరకు ఉడికించిన తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినివ్వాలి.
తరువాత ముందుగా తయారు చేసుకున్న పిండిని తీసుకుని ఉండలుగా చేసుకోవాలి. ఒక్కో ఉండను తీసుకుని పొడి పిండి చల్లుకుంటూ పలుచగా వత్తుకోవాలి. తరువాత మధ్యలో స్టఫింగ్ ను ఉంచి మైదాపిండి పేస్ట్ తో అంచులను మూసి వేయాలి. తరువాత అంచులకు అలాగే పైన నచ్చిన ఆకారంలో డిజైన్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కజ్జికాయలను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా, క్రిస్పీగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మసాలా కజ్జికాయలు తయారవుతాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇలా అప్పటికప్పుడు రుచిగా మసాలా కజ్జికాయలను తయారు చేసి తీసుకోవచ్చు.