Dondakaya Pachi Pachadi : దొండకాయ పచ్చి పచ్చడి…దొండకాయలతో చేసే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దొండకాయలను ఏ మాత్రం ఉడికించకుండా చేసే ఈ పచ్చడి తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. దీనిని ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. దొండకాయలను తినని వారు కూడా ఈ పచ్చడిని ఇష్టంగా తింటారు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. దొండకాయలతో తరుచూఒకేరకం పచ్చడి కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసి తీసుకోవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ దొండకాయ పచ్చి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
దొండకాయ పచ్చి పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి – 10 నుండి 15, దొండకాయ ముక్కలు – పావుకిలో, చింతపండు – నిమ్మకాయంత, ఉప్పు – తగినంత, కరివేపాకు – ఒక రెమ్మ.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు -అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 3.
దొండకాయ పచ్చి పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత పచ్చిమిర్చి వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో దొండకాయ ముక్కలు తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు వేసి బాగా కలపాలి. దొండకాయ ముక్కల్లో ఉండే నీరంతా పోయేలా చేత్తో బాగా పిండి ముక్కలను వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా రెండు నుండిమూడు సార్లు చేసిన తరువాత దొండకాయ ముక్కలను జార్ లో వేసుకోవాలి. తరువాత ఇందులోనే వేయించిన పచ్చిమిర్చి, చింతపండు, కరివేపాకు, ఉప్పు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత తాళింపుకు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసి అంతా కలిసేలా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దొండకాయ పచ్చి పచ్చడి తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన పచ్చడిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.