దంతాలు తెల్లగా ఉండాలనే ఎవరైనా కోరుకుంటారు. అందుకోసమే వివిధ రకాల టూత్ పేస్ట్‌లను, టూత్ పౌడర్‌లను వాడుతుంటారు. అయితే వాటన్నింటి కన్నా సహజసిద్ధమైన పదార్థాలతో తయారు చేసిన పళ్ల పొడి ఎంతో మేలు చేస్తుంది. దాంతో దంతాలను తోముకుంటే తెల్లగా మారుతాయి. దీంతోపాటు దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. నోట్లో బాక్టీరియా నశిస్తుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. మరి ఆ సహజసిద్ధమైన దంతాల పొడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
ఒక టీస్పూన్ సైంధవ లవణం, ఒక టీస్పూన్ లవంగాల పొడి, ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడి, ఒక టీస్పూన్ అతిమధురం చూర్ణం, ఎండబెట్టిన వేపాకులు, ఎండబెట్టిన పుదీనా ఆకులను తీసుకోవాలి. అన్నింటినీ కలిపి మెత్తని పొడిలా చేసుకోవాలి. దీంతో టూత్ పౌడర్ తయారవుతుంది. దీంతో రోజూ దంతాలను తోముకోవచ్చు. ఆ పొడిని ఒక గాలి చొరబడని సీసాలో నిల్వ చేసుకుని రోజూ ఉపయోగించవచ్చు.
పైన తెలిపిన విధంగా తయారు చేసుకున్న పొడిని కొద్దిగా తీసుకుని దాంతో దంతాలను తోముకోవాలి. తరువాత నోటిని శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే కచ్చితంగా ఫలితం కనిపిస్తుంది. దంతాలు తెల్లగా మారుతాయి.
ఈ పొడిలో ఉండే సైంధవ లవణం దంతాలను తెల్లగా మార్చుతుంది. అతి మధురం, వేపాకుల పొడి చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. పుదీనా నోట్లోని బాక్టీరియాను నాశనం చేస్తుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. ఇలా ఈ పొడి వల్ల ప్రయోజనాలు కలుగుతాయి.