Restaurant Style Aloo 65 : మనం బంగాళాదుంపలతో వివిధ రకాల చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంపలతో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు. బంగాళాదుంపలతో చేసుకోదగిన రుచికరమైన చిరుతిళ్లల్లో ఆలూ 65 కూడా ఒకటి. ఆలూ 65 చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు దీనిని ఎంతో ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా రుచిగా ఉండే ఈ ఆలూ 65ని ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఎంతో రుచిగా ఉండే ఈ ఆలూ 65 ని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ 65 తయారీకి కావల్సిన పదార్థాలు..
బంగాళాదుంపలు – 3, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – పావు టీ స్పూన్, మిరియాల పొడి – పావు టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ – 4 టీ స్పూన్స్, మైదాపిండి – 3 టీ స్పూన్స్, నూనె – డీప్ ప్రైకు సరిపడా.
తాళింపుకు కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టీ స్పూన్స్, జీలకర్ర – అర టీస్పూన్, చిన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు – 3, తరిగిన పచ్చిమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, టమాట సాస్ – ఒక టీ స్పూన్స్, చాట్ మసాలా – అర టీ స్పూన్.
ఆలూ 65 తయారీ విధానం..
ముందుగా బంగాళాదుంపలపై ఉండే పొట్టును తీసి వేయాలి. తరువాత వీటిని తురుముకోవాలి. బంగాళాదుంప తురుము మరీ సన్నగా లేకుండా చూసుకోవాలి. తరువాత ఈ తురుమును నీటిలో వేసి 2 నుండి 3 సార్లు బాగా కడగాలి. తరువాత ఈ తురుమును నీళ్లు లేకుండా చేత్తో గట్టిగా పిండి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి కలపాలి. అవసరమైతే కొద్దిగా నీటిని చల్లుకుని కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బంగాళాదుంప తురుమును ఉండలుగా చేసుకుని నూనెలో వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మటంపై ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి.
తరువాత కళాయిలో తాళింపుకు నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించాలి. తరువాత వేయించిన ఉండలు, టమాట సాస్ వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత చాట్ మసాలా వేసికలపాలి. దీనిని మరో నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ 65 తయారవుతుంది. దీనిని వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది. స్నాక్స్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా బంగాళాదుంపలతో ఆలూ 65ని తయారు చేసుకుని తినవచ్చు.