Pappu Dappalam : పప్పు దప్పళం.. ఇది తెలియని తెలుగు వారు ఉండరనే చెప్పవచ్చు. పప్పు, దప్పళాన్ని కలిపి తింటే ఆ రుచే వేరుగా ఉంటుంది. దీనిని ఎక్కువగా పండుగలకు, ఫంక్షన్ లకు, పూజలు ఉన్న రోజూ తయారు చేస్తూ ఉంటారు. దీనిని ఇష్టపడని వారు, రుచి చూడని వారు ఉండరనే చెప్పవచ్చు. ఈ పప్పు దప్పళాన్ని మనం కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. చాలా సులభంగా, చాలా తక్కువ సమయంలో దీనిని తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ పప్పు, దప్పళాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పప్పు దప్పళం తయారీకి కావల్సిన పదార్థాలు..
ముద్ద పప్పు తయారీకి కావల్సిన పదార్థాలు..
కందిపప్పు – అర కప్పు, నీళ్లు – ఒకటిన్నర కప్పులు, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, నూనె – ఒక టీ స్పూన్, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, ఇంగువ – అర టీ స్పూన్.
దప్పళం తయారీకి కావల్సిన పదార్థాలు..
నానబెట్టిన చింతపండు – 20 గ్రా., నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, ఆవాలు -ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 1, కరివేపాకు – ఒక రెమ్మ, గుమ్మడి ముక్కలు – ఒక కప్పు, సొరకాయ ముక్కలు -ఒక కప్పు, తరిగిన మునక్కాయ – 1, గుండ్రంగా తరిగిన ముల్లంగి – 1, తరిగిన బెండకాయలు – 2, తరిగిన వంకాయలు – 2, తరిగిన పచ్చిమిర్చి – 3, తరిగిన టమాటాలు – 2, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, నీళ్లు – 3 కప్పులు, బెల్లం తురుము – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మసాలా పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
ఎండుమిర్చి – 4 నుండి 5, ధనియాలు – అర టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, మెంతులు – అర టీ స్పూన్, ఎండు కొబ్బరి – 2 ఇంచుల ముక్క, కరివేపాకు – 2 రెమ్మలు, బియ్యం- ఒక టేబుల్ స్పూన్.
పప్పు దప్పళం తయారీ విధానం..
ముందుగా పప్పును తయారు చేసుకోవడానికి గానూ కుక్కర్ లో పప్పును వేసి వేయించాలి. తరువాత దీనిని శుభ్రంగా కడిగి నీళ్లు పోయాలి. తరువాత ఉప్పు, పసుపు, నూనె వేసి మూత పెట్టాలి. దీనిని 3 నుండి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మూత తీసి పప్పును మెత్తగా చేసుకోవాలి. తరువాత తాళింపుకు కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. తరువాత ఈ తాళింపును పప్పులో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు దప్పళం కోసం కళాయిలో మసాలా పొడికి కావల్సిన పదార్థాలు వేసి దోరగా వేయించాలి. తరువాత వీటిని జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కుక్కర్ లో నూనె వేసి వేడి చేయాలి. తరువాత మెంతులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి.
ఇవన్నీ వేగిన తరువాత కూరగాయ ముక్కలు వేసి కలపాలి. తరువాత ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత చింతపండు పులుసు, నీళ్లు పోసి కలపాలి. తరువాత కుక్కర్ మూత పెట్టి మధ్యస్థ మంటపై ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ మూత తీసిన తరువాత మరలా స్టవ్ మీద ఉంచాలి. తరువాత బెల్లం తురుము, మిక్సీ పట్టుకున్న పొడి వేసి కలపాలి. దీనిని ఒక పొంగు వచ్చే వరకు మరిగించి కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పప్పు, దప్పళం తయారవుతుంది. ఇలా తయారు చేసుకున్న పప్పును, దప్పళాన్ని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.