Kesari Burelu : కేసరి బూరెలు.. వీటినే రవ్వ బూరెలు అని కూడా అంటారు. రవ్వతో చేసే ఈ బూరెలు చాలా రుచిగా ఉంటాయి. తీపి తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈ రవ్వ బూరెలను తయారు చేసి తీసుకోవచ్చు. వీటిని నైవేధ్యంగా కూడా సమర్పించవచ్చు. ఈ రవ్వ బూరెలను తయారు చేయడం చాలా సులభం. ఎవరైనా చాలా సులభంగా ఈ కేసరి బూరెలను తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ కేసరి బూరెలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కేసరి బూరెల తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – ఒక టీ స్పూన్, ఉప్మా రవ్వ – ఒక టీ గ్లాస్, నీళ్లు – 2 గ్లాసులు, పంచదార – ఒక టీ గ్లాస్, యాలకుల పొడి – పావు టీ స్పూన్, దోశపిండి – ఒక కప్పు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
కేసరి బూరెల తయారీ విధానం..
ముందుగా కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత రవ్వ వేసి వేయించాలి. దీనిని కొద్దిగా రంగు మారే వరకు వేయించిన తరువాత నీళ్లు పోసి కలపాలి. దీనిని ఉండలు లేకుండా కలుపుకున్న తరువాత దగ్గర పడే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత పంచదార వేసి కలపాలి. మరలా దీనిని కలుపుతూ ఉడికించాలి. రవ్వ మిశ్రమం పూర్తిగా దగ్గర పడిన తరువాత యాలకుల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత చేతికి నెయ్యి రాసుకుంటూ కొద్ది కొద్దిగా రవ్వను తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక రవ్వ ఉండలను దోశపిండిలో పిండి ముంచి నూనెలో వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కేసరి బూరెలు తయారవుతాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ విధంగా చాలా సులభంగా రుచిగా కేసరి బూరెలను తయారు చేసి తీసుకోవచ్చు.