Instant Gulkand : గుల్ కంద్.. దీని గురించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. గులాబీ పువ్వులు, పంచదార కలిపి చేసే ఈ గుల్ కంద్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని నేరుగా తీసుకోవచ్చు లేదా స్వీట్స్, స్మూతీలు, మిల్క్ షేక్స్ ఇలా ఏ రూపంలోనైనా తీసుకోవచ్చు. గుల్ కంద్ ను తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. గుల్ కంద్ ను తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి చలువ చేస్తుంది. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్త్రీలు దీనిని తీసుకోవడం వల్ల నెలసరి సమస్యలు తగ్గుతాయి.
గర్భిణీ స్త్రీలు దీనిని తీసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. గుల్ కంద్ ను తీసుకోవడం వల్ల అరికాళ్లు, అరి చేతులల్లో మంటలు తగ్గుతాయి. పిల్లలకు దీనిని ఇవ్వడం వల్ల వారిలో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఈ విధంగా పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరి ఈ గుల్ కంద్ ఎంతో మేలు చేస్తుంది. గుల్ కంద్ మనకు ఎక్కువగా బయట మార్కెట్ లో, ఆన్ లైన్ లో లభిస్తుంది. అలాగే ఈ గుల్ కంద్ ను ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. చాలా సులభంగా అలాగే ఇన్ స్టాంట్ గా దీనిని తయారు చేసుకోవచ్చు. మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ గుల్ కంద్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గుల్ కంద్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నాటు గులాబీ రేకులు – 50 గ్రా., పంచదార లేదా పటిక బెల్లం – 60 గ్రా., దంచిన సోంపు గింజలు – ఒక టీ స్పూన్, యాలకుల పొడి – పావు టీ స్పూన్, తేనె – 3 లేదా 4 టేబుల్ స్పూన్స్.
గుల్ కంద్ తయారీ విధానం..
ముందుగా గులాబీ రేకులను శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. గులాబీ రేకులు పొడిగా మారిన తరువాత వాటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో పంచదార వేసి చేత్తో బాగా నలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని కళాయిలో వేసి పంచదార కరిగే వరకు కలుపుతూ వేయించాలి. పంచదార కరిగిన తరువాత సోంపుగింజలు, యాలకుల పొడి వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఇందులో తేనె వేసి కలిపి చల్లారనివ్వాలి. ఇలా చేయడం వల్ల గుల్ కంద్ తయారవుతుంది. దీనిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల నెల రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఇలా తయారు చేసిన గుల్ కంద్ ను పిల్లలు అర టీస్పూన్ మోతాదులో పెద్దలు ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకోవడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు.