Tomato Rasam : టమాటాలలో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో టమాట రసం కూడా ఒకటి. టమాట రసం చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ టమాట రసాన్ని ఒక్కో పద్దతిలో తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా తయారు చేసే టమాట రసం కూడా చాలా రుచిగా ఉంటుంది. అలాగే చాలా తక్కువ సమయంలో దీనిని తయారు చేసుకోవచ్చు. నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు ఇలా అప్పటికప్పుడు టమాట రసాన్ని తయారు చేసి తీసుకోవచ్చు. మరింత సులభంగా, రుచిగా టమాట రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట రసం తయారీకి కావల్సిన పదార్థాలు..
నానబెట్టిన చింతపండు – నిమ్మకాయంత, టమాటాలు – 3, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు -ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి- 2, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, తరిగిన పచ్చిమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, ఇంగువ – పావు టీ స్పూన్, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, పసుపు – పావు టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, రసం పొడి – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, నీళ్లు – తగినన్ని, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
టమాట రసం తయారీ విధానం..
ముందుగా రెండు టమాటాలను జార్ లో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత మిగిలిన టమాటాలను ముక్కలుగా కట్ చేసి పక్కకు ఉంచాలి. తరువాత మిక్సీ పట్టుకున్న టమాట పేస్ట్ ను నానబెట్టిన చింతపండులో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు నుండి గుజ్జును తీసి వడకట్టి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసివేయించాలి.
తరువాత ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత కట్ చేసుకున్న టమాట ముక్కలు వేసి వేయించాలి. టమాట ముక్కలు మగ్గిన తరువాత పసుపు, ఉప్పు, కారం, రసం పొడి వేసి కలపాలి. తరువాత చింతపండు రసం, నీళ్లు పోసి కలపాలి. ఈ రసాన్ని ఒక పొంగు వచ్చే వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట రసం తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చాలా సులభంగా, చాలా తక్కువ సమయంలో టమాట రసాన్ని తయారు చేసి తీసుకోవచ్చు.