Instant Ravva Uthappam : రవ్వతో మనం రకరకాల అల్పాహారాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. రవ్వతో చేసే అల్పాహారాలు రుచిగా ఉండడంతో పాటు చాలా సులభంగా, చాలా తక్కువ సమయంలో వీటిని తయారు చేసుకోవచ్చు. రవ్వతో చేసుకోదగిన రుచికరమైన అల్పాహారాల్లో ఊతప్పం కూడా ఒకటి. రవ్వతో చేసే ఈ ఊతప్పం చాలా రుచిగా ఉంటుంది. ఇన్ స్టాంట్ గా దీనిని తయారు చేసుకోవచ్చు. సమయం తక్కువగా ఉన్నప్పుడు, వెరైటీగా తినాలనిపించినప్పుడు ఇలా రవ్వతో ఊతప్పంను తయారు చేసి తీసుకోవచ్చు. రవ్వతో రుచిగా ఊతప్పాలను ఇన్ స్టాంట్ గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రవ్వ ఊతప్పం తయారీకి కావల్సిన పదార్థాలు..
బొంబాయి రవ్వ – ఒక కప్పు, పెరుగు – అర కప్పు, ఉప్పు – తగినంత, నీళ్లు – అరకప్పు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన టమాట – 1, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, వంటసోడా – అర టీ స్పూన్.
రవ్వ ఊతప్పం తయారీ విధానం..
ముందుగా గిన్నెలో రవ్వను తీసుకోవాలి. తరువాత ఇందులో పెరుగు, నీళ్లు, ఉప్పు వేసి బాగా కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు రవ్వను నానబెట్టాలి. రవ్వ నానిన తరువాత ఇందులో వంటసోడా వేసి కలపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. తరువాత దీనిపై నూనె వేసుకోవాలి. తరువాత గంటెతో పిండిని తీసుకుని ఊతప్పంలాగా వేసుకోవాలి. తరువాత దీనిపై టమాట ముక్కలు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. దీనిపై కొద్దిగా నూనె వేసి మూత పెట్టి కాల్చుకోవాలి. ఊతప్పం ఒకవైపు కాలిన తరువాత మరోవైపుకు తిప్పుకుని కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రవ్వ ఊతప్పం తయారవుతుంది. దీనిని ఏ చట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. ఈవిధంగా తయారు చేసిన రవ్వ ఊతప్పాలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.