Tiffin Center Palli Chutney : మనం అల్పాహారాల్లోకి పల్లీలతో రకరకాల చట్నీలను తయారు చేస్తూ ఉంటాము. పల్లీలతో చేసే చట్నీలు చాలా రుచిగా ఉంటాయి. మనం మన రుచికి తగినట్టు వివిధ రుచుల్లో ఈ చట్నీలను తయారు చేస్తూ ఉంటాము. కింద చెప్పిన విధంగా తయారు చేసే పల్లి చట్నీ కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇడ్లీ, దోశ, వడ, ఊతప్పం ఇలా దేనితో తినాడానికైనా ఈ చట్నీ చాలా చక్కగా ఉంటుంది. దీనిని తయారు చేసుకోవడం చాలా సులభం. మరింత రుచిగా పల్లి చట్నీని అల్పాహారాల్లోకి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పల్లి చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – ముప్పావు కప్పు, నూనె – ఒక టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి – 8 నుండి 10, జీలకర్ర – అర టీ స్పూన్, మినపగుళ్లు – ఒక టీ స్పూన్, పుట్నాల పప్పు – 2 టేబుల్ స్పూన్స్, వెల్లుల్లి రెబ్బలు – 3, చింతపండు – ఒక రెమ్మ, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, నీళ్లు – తగినన్ని.
పల్లి చట్నీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత పల్లీలు వేసి వేయించాలి. వీటిని దోరగా వేయించిన తరువాత పచ్చిమిర్చి, జీలకర్ర, మినపగుళ్లు వేసి వేయించాలి. ఇవన్నీ చక్కగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి పుట్నాల పప్పు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, కరివేపాకు వేసి చల్లారనివ్వాలి. ఇవన్నీ చల్లారిన తరువాత జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే ఉప్పు, నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఈ చట్నీకి తాళింపు చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పల్లీ చట్నీ తయారవుతుంది. దీనిని ఏ అల్పాహారంతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది.