Masala Milk : మసాలా మిల్క్.. ప్రత్యేకమైన మసాలాతో తయారు చేసే ఈ మిల్క్ చాలా రుచిగా ఉంటాయి. మసాలా మిల్క్ ను తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్పెక్షన్ లు రాకుండా ఉంటాయి. దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. చలికాలంలో ఈ మసాలా మిల్క్ ను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలగడంతో పాటు చలినుండి ఉపశమనం కూడా కలుగుతుంది. ఈ పాలను రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి బలం కలగడంతో పాటు వాతావరణ మార్పుల వల్ల కలిగే అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. ఆరోగ్యానికి ఎంతో మేలును కలిగించే మసాలా మిల్క్ ను ఎలా తయారు చేసుకోవాలి… అలాగే ఈ పాలను తయారు చేసుకునే అవసరమయ్యే మసాలా పొడిని ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మసాలా మిల్క్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బాదంపప్పు – పావు కప్పు, జీడిపప్పు – పావు కప్పు, పిస్తా పప్పు – పావు కప్పు, నల్ల మిరియాలు – 2 టీ స్పూన్స్, లవంగాలు – ఒక టీ స్పూన్, యాలకులు – అర టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, పాలు – 2 కప్పులు, పంచదార – తగినంత.
మసాలా మిల్క్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో బాదంపప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు వేసి వేయించాలి. వీటిని కొద్దిగా రంగు మారే వరకు దోరగా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో లవంగాలు, యాలకులు, మిరియాలు వేసి వేయించి స్టవ్ ఆప్ చేసుకోవాలి. ఇప్పుడు జార్ లో వేయించని మసాలా దినుసులు, వేయించిన డ్రై ఫ్రూట్స్, పసుపు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడి చల్లారిన తరువాత గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడి 6 నెలల పాటు తాజాగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల మసాలా పొడి తయారవుతుంది. ఈ పొడితో పాలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
దీని కోసం ఒక గిన్నెలో పాలు పోసి వేడి చేయాలి. పాలు పొంగు వచ్చిన తరువాత ఇందులో మసాలా పొడిని 2 టీ స్పూన్ల మోతాదులో వేసి కలపాలి. తరువాత పంచదార వేసి కలపాలి. ఈ పాలను మరో 2 నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పాలను గ్లాస్ లో పోసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మసాలా మిల్క్ తయారవుతుంది. ఈ పాలను ఫ్రిజ్ లో ఉంచి చల్లారిన తరువాత తీసుకోవచ్చు లేదా వేడిగా తీసుకోవచ్చు. అలాగే ఇందులో పంచదార వేయకుండా కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా మసాలా పాలను చేసి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.