Ravva Aloo Fingers : మనం బొంబాయి రవ్వతో అనేక రకాల స్నాక్స్ ను తయారు చేస్తూ ఉంటాము. బొంబాయి రవ్వతో సులభంగా చేసుకోదగిన రుచికరమైన స్నాక్ ఐటమ్స్ లో రవ్వ ఆలూ ఫింగర్స్ కూడా ఒకటి. బొంబాయి రవ్వ, బంగాళాదుంపలు కలిపి చేసే ఈ ఫింగర్స్ చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా క్రిస్పీగా ఉంటాయి. స్నాక్స్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. వేడి వేడిగా స్నాక్స్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు వీటిని తయారు చేసి తీసుకోవచ్చు.ఈ పింగర్స్ ను తయారు చేయడం చాలా సులభం. రుచిగా, క్రిస్పీగా ఉండే రవ్వ ఆలూ ఫింగర్స్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రవ్వ ఆలూ ఫింగర్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నీళ్లు – ఒక కప్పు, ఉప్మా రవ్వ – ఒక కప్పు, ఉడికించిన బంగాళాదుంపలు – 3, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, మిరియాల పొడి – పావు టీ స్పూన్, చిల్లీ ప్లేక్స్ – అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
రవ్వ ఆలూ ఫింగర్స్ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో నీళ్లు పోసి వేడిచేయాలి. నీళ్లు మరిగిన తరువాత రవ్వ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. రవ్వ దగ్గర పడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.రవ్వ చల్లారిన తరువాత చేత్తో అంతా కలిసేలా మెత్తగా కలుపుకోవాలి. తరువాత బంగాళాదుంపముక్కలను తురుమి వేసుకోవాలి. ఇందులోనే నూనె తప్ప మిగిలిన పదార్థాలు వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. తరువాత చేతులకు నూనె రాసుకుంటూ కొద్ది కొద్దిగా రవ్వ మిశ్రమాన్ని తీసుకుని ఫింగర్స్ లాగా చుట్టుకోవాలి. ఇవి అన్నీ కూడా ఒకే పరిమాణంలో ఉండేలా చూసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఫింగర్స్ ను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా, క్రిస్పీగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రవ్వ ఆలూ ఫింగర్స్ తయారవుతాయి. వీటిని టమాట కిచప్ తో తింటే చాలా రుచిగాఉంటాయి. ఈ విధంగా తయారు చేసిన రవ్వ ఆలూ ఫింగర్స్ ను పిల్లలు మరింత ఇష్టంగా తింటారు.