Crispy Dal Masala Vada : దాల్ మసాలా వడలు.. పప్పులతో చేసే ఈ వడలు క్రిస్పీగా, చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. అలాగే వీటిని తీసుకోవడం వల్ల పప్పులలో ఉండే పోషకాలు లభిస్తాయి. ఈ వడలను తయారు చేసుకోవడం చాలా సులభం. ఎవరైనా చాలా సులభంగా చాలా రుచిగా వీటిని తయారు చేసుకోవచ్చు. తరుచూ ఒకేరకం మసాలా వడలు కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసి తీసుకోవచ్చు. బయట లభించే చిరుతిళ్లను తినడానికి బదులుగా ఇలా ఇంట్లోనే వడలను తయారు చేసి తీసుకోవడం మంచిది. క్రిస్పీగా, రుచిగా ఉండే ఈ మసాలా వడలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
క్రిస్పీ దాల్ మసాలా వడ తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపప్పు – ఒక టీ గ్లాస్, మినపప్పు – అర టీ గ్లాస్, పెసరపప్పు – అర టీ గ్లాస్, పచ్చిమిర్చి – 3, అల్లం – ఒక ఇంచు ముక్క, బియ్యం పిండి – 1 లేదా 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన పుదీనా – గుప్పెడు, తరిగిన కొత్తిమీర – గుప్పెడు, తరిగిన ఉల్లిపాయ – 1, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
క్రిస్పీ దాల్ మసాలా వడ తయారీ విధానం..
ముందుగా పప్పులను 4 గంటల పాటు విడివిడిగా నీటిలో నానబెట్టాలి. పప్పులు నానిన తరువాత జార్ లో శనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం వేసి మరీ మెత్తగా కాకుండా బరకగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే జార్ లో మినపప్పును, పెసరపప్పును విడివిడిగా వేసి బరకగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత బియ్యంపిండి వేసి కలపాలి. తరువాత కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి బాగా కలపాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె మధ్యస్థంగా వేడయ్యాక పిండిని తీసుకుని వడలుగా వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దాల్ మసాలా వడలు తయారవుతాయి. వీటిని టమాట కిచప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. వేడి వేడిగా స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇలా దాల్ మసాలా వడలను తయారు చేసి తీసుకోవచ్చు. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.