Wheat Flour Dry Fruit Biscuits : బిస్కెట్స్.. అనగానే మనకు మైదాపిండితో చేసిన బిస్కెట్లు మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ గోధుమపిండితో కూడా మనం రుచికరమైన బిస్కెట్లను తయారు చేసుకోవచ్చు. గోధుమపిండి, డ్రై ఫ్రూట్స్ కలిపి చేసే ఈ బిస్కెట్లు చాలా రుచిగా ఉంటాయి. గుల్లగుల్లగా, క్రిస్పీగా ఉండే ఈ బిస్కెట్లను పిల్లలు మరింత ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. ఈ బిస్కెట్లు నిల్వ కూడా ఉంటాయి. వీటినితయారు చేయడం కూడా చాలా సులభం. ఎవరైనా చాలా తేలికగా చాలా తక్కువ సమయంలో వీటిని తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే ఈ గోధుమపిండి బిస్కెట్లను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమపిండి డ్రై ఫ్రూట్స్ బిస్కెట్ల తయారీకి కావల్సిన పదార్థాలు..
టూటీ ఫ్రూటీ – 2 టీ స్పూన్స్, బాదంపప్పు – 2 టీ స్పూన్స్, జీడిపప్పు – 2 టీ స్పూన్స్, పాలు – ఒక టీ గ్లాస్, పంచదార – అర కప్ప, బటర్ లేదా నెయ్యి – పావు కప్పు, గోధుమపిండి – 2 కప్పులు, ఉప్పు – చిటికెడు, వంటసోడా – అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
గోధుమపిండి డ్రై ఫ్రూట్స్ బిస్కెట్ల తయారీ విధానం..
ముందుగా ఒక ప్లేట్ లో డ్రై ఫ్రూట్స్, టూటీ ఫ్రూటీని తీసుకోవాలి. తరువాత వీటిపై కొద్దిగా గోధుమపిండిని చల్లి అంతా కలిసేలా కలుపుకోవాలి. తరువాత వీటిని జార్ లో వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో పాలు, పంచదార, బటర్ వేసి బాగా కలపాలి. తరువాత గోధుమపిండి. ఉప్పు, వంటసోడా, మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి. పిండి పలుచగా అయితే గోధుమపిండి వేసి కలపాలి. గట్టిగా అయితే పాలను పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత పిండిపై మూత పెట్టి 10 నిమిషాల ఆ పాటు పక్కకు ఉంచాలి. తరువాత పిండిని రెండు భాగాలుగా చేసుకోవాలి. ఒక భాగాన్ని తీసుకుని పొడి పిండి చల్లుకుంటూ మందంగాచపాతీలా వత్తుకోవాలి.
తరువాత దీనిని మడతలుగా వేసి మరలా చపాతీలాగా వెడల్పుగా వత్తుకోవాలి. తరువాత మనకు కావల్సిన ఆకారంలో బిస్కెట్లుగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బిస్కెట్లను వేసి కదిలించకుండా అలాగే ఉంచాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత అటూ ఇటూ తిప్పుతూ ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోధుమపిండి బిస్కెట్లు తయారవుతాయి. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల వారం నుండి పదిరోజుల పాటు నిల్వ ఉంటాయి. ఈ విధంగా తయారు చేసిన బిస్కెట్లను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.