Rayalaseema Pachi Mirchi Pappu : రాయలసీమ పచ్చిమిర్చి పప్పు.. రాయలసీమ స్పెషల్ అయిన ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. ఎండుకారం వేయకుండా, చింతపండు వేయకుండా పచ్చిమిర్చితో చేసే ఈ పప్పు చాలా రుచిగా ఉంటుంది. అన్నం, జొన్న రొట్టె, చపాతీ, పుల్కా వంటి వాటితో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఈ పప్పును తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే పప్పు కావాలంటారు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే రాయలసీమ పచ్చిమిర్చి పప్పును ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రాయలసీమ పచ్చిమిర్చి పప్పు తయారీకి కావల్సిన పదార్థాలు..
కందిపప్పు – అర కప్పు, పచ్చిమిర్చి – 10 నుండి 12, పెద్ద ఉల్లిపాయలు – 2, పుల్లటి టమాటాలు – 3, ధనియాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, నీళ్లు – అరలీటర్, ఉప్పు – తగినంత.
తాళింపుకు కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, శనగపప్పు – ఒక టేబుల్ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, ఇంగువ – పావు టీ స్పూన్, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – పిడికెడు.
రాయలసీమ పచ్చిమిర్చి పప్పు తయారీ విధానం..
ముందుగా కందిపప్పును అరగంట పాటు నీటిలో నానబెట్టుకోవాలి. తరువాత ఈ పప్పును కుక్కర్ లో వేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చితో పాటు ఉల్లిపాయలను నాలుగు ముక్కలుగా తరిగి వేసుకోవాలి. తరువాత టమాటాలను కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తరువాత మిగిలిన పదార్థాలతో పాటు నీటిని పోసి మూత పెట్టి మధ్యస్థ మంటపై 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ ఆవిరి పోయిన తరువాత మూత తీసి పప్పును మెత్తగా చేసుకోవాలి. తరువాత తాళింపుకు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, ఇంగువ వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత కరివేపాకు, కొత్తిమీర వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత దీనిని పప్పులో వేసికలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రాయలసీమ పచ్చిమిర్చి పప్పు తయారవుతుంది. కారంగా ఉన్నప్పటికి కూడా ఈ పప్పును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.