Flax Seeds For Beauty : అందంగా కనిపించాలని కోరుకొని వారు ఉండరనే చెప్పవచ్చు. అందంగా కనిపించడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అనేక చిట్కాలను పాటిస్తారు. ఎంతో డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు. అయినప్పటికి మనలో చాలా మంది మొటిమలు, మచ్చలు, ముడతలు వంటి వివిధ రకాల చర్మ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే అందంగా కనిపించాలనుకునే వారు, యవ్వనంగా కనిపించాలనుకునే వారు ఇలా బ్యూటీ పార్లర్ కు డబ్బులు ఖర్చు పెట్టడానికి బదులుగా అవిసె గింజలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అవిసె గింజలల్లో అనేక పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఆర్థరైటిస్, డయాబెటిస్, కొలెస్ట్రాల్ వంటి సమస్యలను తగ్గించడంలో ఇవి మనకు ఎంతగానో సహాయపడతాయి. అలాగే అవిసె గింజల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి.
ఇవి మన చర్మానికి, జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. చాలా మంది జుట్టు పెరుగుదలకు అవిసె గింజలను వాడుతూ ఉంటారు. ఇవి చర్మానికి కూడా మేలు చేస్తాయని చాలా మందికి తెలియదు. అవిసె గింజలను వాడడం వల్ల మనం అందమైన, ఆరోగ్యకరమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. అలాగే చాలా కాలం వరకు యవ్వనంగా కనిపించవచ్చు. అయితే అవిసె గింజలను ఎలా వాడాలి.. వీటిని వాడడం వల్ల మన చర్మానికి కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందమైన చర్మం కావాలనుకునే వారు అవిసె గింజలను వారి ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిది. రోజూ ఒక టీ స్పూన్ అవిసె గింజలను తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే అవిసె గింజలను ఉడికించగా వచ్చిన జెల్ ను ఫేస్ ప్యాక్ గా కూడా ఉపయోగించుకోవచ్చు. నానబెట్టిన అవిసె గింజలను నీటిలో వేసి ఉడికించాలి. ఇలా ఉడికించడం వల్ల నీటిపై జెల్ గా తయారవుతుంది. ఈ జెల్ గిన్నెలోకి తీసుకుని చల్లారినివ్వాలి. జెల్ చల్లారిన తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకుని జెల్ ను రాసుకోవాలి. ఇది ఆరిన తరువాత మరలా జెల్ ను రాసుకోవాలి.
ఇలా రెండు సార్లు రాసుకున్న తరువాతపూర్తిగా ఆరనివ్వాలి. తరువాత నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇలా అవిసె గింజల జెల్ ను ముఖానికి రాసుకోవడం వల్ల ముఖంపై ఉండే దద్దుర్లు, ఎరుపుదనం, వాపు, మచ్చలు, మొటిమలు తగ్గుతాయి. చర్మంపై ఉండే సన్నటి గీతలు తొలగిపోతాయి. అలాగే ఒక గుడ్డులో అవిసె గింజల పొడి వేసి కలిపి చర్మానికి రాసుకోవాలి. ఆరిన తరువాత కడిగివేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం లోపలి నుండి శుభ్రపడుతుంది. అదే విధంగా 4 గంటల పాటు నానబెట్టిన అవిసె గింజలను రోజ్ వాటర్ తో కలిపి పేస్ట్ గా చేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఆరిన తరువాత కడిగి వేయాలి. ఇలా చేయడం వల్ల మెరిసే చర్మం సొంతమవుతుంది. ఈ విధంగా అవిసె గింజలు కూడా మన చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఆహారంగా తీసుకోవడంతో పాటు ఫేస్ ప్యాక్ లాగా వాడడం వల్ల అందమైన, ప్రకాశవంతమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.