Cabbage Sambar : మనం క్యాబేజిని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. క్యాబేజి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనితో పప్పు, ఫ్రై, కూర, పచ్చడి ఇలా అనేక రకాల వంటకాలు వండుకుని తింటూ ఉంటాము. చాలా మంది క్యాబేజిని ఇష్టంగా తింటూ ఉంటారు. ఇవే కాకుండా క్యాబేజితో మనం సాంబార్ ను కూడా తయారు చేసుకోవచ్చు. క్యాబేజి సాంబార్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. క్యాబేజిని ఇష్టపడని వారు కూడా ఇలా తయారు చేసిన క్యాబేజి సాంబార్ ను ఇష్టంగా తింటారు. వెరైటీ రుచులు కోరుకునే వారు ఇలా క్యాబేజితో వెరైటీగా సాంబార్ ను తయారు చేసి తీసుకోవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ క్యాబేజి సాంబార్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి.. ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాబేజి సాంబార్ తయారీకి కావల్సిన పదార్థాలు..
కందిపప్పు – అర కప్పు, నీళ్లు – 750 ఎమ్ ఎల్, నూనె – ఒక టీ స్పూన్, మెంతులు -ఒక టీ స్పూన్, శనగపప్పు – 2 టీ స్పూన్స్, మిరియాలు – ఒక టీ స్పూన్, ధనియాలు – 2 టీ స్పూన్స్, బియ్యం – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 3, జీలకర్ర – ఒక టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, పచ్చికొబ్బరి తురుము – పిడికెడు, ఇంగువ – పావు టీ స్పూన్, సన్నగా తరిగిన క్యాబేజి – అరకిలో, నానబెట్టిన చింతపండు – పెద్ద నిమ్మకాయంత, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన టమాటాలు – 2, కారం – ఒక టేబుల్ స్పూన్, బెల్లం తురుము – 2 టీ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – పిడికెడు.
తాళింపుకు కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – ఒక టీ స్పూన్, మెంతులు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, దంచిన వెల్లుల్లి రెమ్మలు – 4, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ.
క్యాబేజి సాంబార్ తయారీ విధానం..
ముందుగా కందిపప్పును కళాయిలో వేసి దోరగా వేయించాలి. తరువాత ఈ పప్పును శుభ్రంగా కడిగి నీళ్లు పోసి 5 నుండి 6 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించాలి. పప్పు ఉడికిన తరువాత పప్పు గుత్తితో మెత్తగా చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత గిన్నెలో అరలీటర్ నీటిని పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక క్యాబేజి వేసి సగం వరకు ఉడికించాలి. తరువాత ఈ క్యాబేజిని వడకట్టి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మెంతులు, శనగపప్పు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత మిరియాలు, ధనియాలు, బియ్యం, ఎండుమిర్చి, జీలకర్ర వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు, పచ్చికొబ్బరి తురుము, ఇంగువ వేసి కలిపి చల్లారనివ్వాలి. తరువాత ఈ దినుసులన్నింటిని జార్ లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత చింతపండు నుండి రసాన్ని తీసుకోవాలి. ఇందులో ఒక లీటర్ నీటిని పోసి వేడి చేయాలి.
చింతపులుసు మరిగిన తరువాత పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి, టమాటాలు, కారం, ఉడికించిన పప్పు, ఉడికించిన క్యాబేజి, మిక్సీ పట్టుకున్న పేస్ట్ , బెల్లం తురుము, 2 రెమ్మల కరివేపాకు వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు మరిగించాలి. సాంబార్ మరుగుతుండగానే కళాయిలో తాళింపుకు నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత దీనిని మరుగుతన్న సాంబార్ లో వేసి మరో 2 నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యాబేజి సాంబార్ తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ సాంబార్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.