Peethala Pulusu : మనం ఆహారంగా తీసుకునే సముద్రపు ఆహారాల్లో పీతలు కూడా ఒకటి. పీతలను చాలా మంది ఇష్టంగా తింటారు. వీటిలో కూడా మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు ఉంటాయి. పీతలతో చేసిన వంటకాలను తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. పీతలతో ఎక్కువగా చేసే వంటకాల్లో పీతల పులుసు కూడా ఒకటి. పీతల పులుసు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది పీతల పులుసును తినడానికి ఇష్టపడతారని చెప్పవచ్చు. పీతల పులుసును తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. ఎవరైనా చాలా తేలికగా దీనిని తయారు చేసుకోవచ్చు. రుచిగా, కమ్మగా ఆంధ్రా స్టైల్ లో పీతల పులుసును ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పీతల పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
శుభ్రం చేసిన పీతలు – అరకిలో, నానబెట్టిన చింతపండు – నిమ్మకాయంత, నూనె – 3 లేదా 4 టేబుల్ స్పూన్స్, తరిగిన ఉల్లిపాయలు – 2, తరిగిన పచ్చిమిర్చి – 3, మెంతులు – చిటికెడు, తరిగిన టమాట – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – ఒక గ్లాస్, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, కరివేపాకు – 2 రెమ్మలు, గరం మసాలా – అర టీ స్పూన్.
పీతల పులుసు తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మెంతులు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత టమాట ముక్కలు వేసి మెత్తబడే వరకు మగ్గించాలి. టమాట ముక్కలు మెత్తగా అయిన తరువాత పీతలు వేసి కలపాలి. తరువాత ఉప్పు, కారం, పసుపు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించిన తరువాత చింతపండు పులుసు వేసి కలపాలి. తరువాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కరివేపాకు వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి. పీతలు మెత్తగా ఉడికి నూనె పైకి తేలిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పీతల పులుసు తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన పీతల పులుసును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.