Okra For Nerves : మన శరీరం అనేక అవయవాల కలయిక. ఇది మనందరికి తెలిసిందే. అలాగే అవయవాలు అనేక కణాలతో ఏర్పడతాయి. దాదాపు మన శరీరంలో 125 ట్రిలియన్ కణాలు ఉంటాయి. ఒక ట్రిలియన్ అనగా లక్ష కోట్లు. ఈ విధంగా మన శరీరం అనేక కణాలతో ఏర్పడుతుంది. ఈ కణాలు కొన్ని వాటి వయసు దాటి పోవడం వల్ల కొన్ని దెబ్బతినడం వల్ల చనిపోతూ ఉంటాయి. అలాగే చనిపోయిన కణాల స్థానంలో కొత్త కణాలు తిరిగి పుడుతూ ఉంటాయి. ఈ విధంగా మన శరీరం నిర్మించబడింది. కానీ మన శరీరంలో రెండు కణాలు మాత్రం చనిపోతే మరలా పుట్టవు. అలాగే ఇవి దెబ్బతిన్నా కూడా తిరిగి బాగుకావు. మనం పుట్టినప్పుడు వచ్చిన కణాలే మనం చనిపోయే వరకు ఉంటాయి. అవే మెదడు కణాలు మరియు నరాల కణాలు. ఈ కణాలే మన శరీరంలో అతి ముఖ్యమైనవి.
మెదడు కణాలు మరియు నరాల కణాల ఆయుర్దాయం 150 సంవత్సరాలు. ఒక్కసారి పుట్టిన ఈ కణాలు 150 సంవత్సరాల వరకు అవే ఉంటాయి. ఈ కణాలు నశిస్తే వాటి స్థానంలో మరలా కొత్తవి రావు కనుక వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి. మన శరీరంలో నరాల కణాలు అతి ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. మెదడు నుండి సమాచారాన్ని అవయవాలకు, అలాగే అవయవాల నుండి సమాచారాన్ని తిరిగి మెదడుకు అందిస్తూ ఉంటాయి. శరీరంలో సంకేతాలను అందించడంలో, మనం పనులు చేసుకోవడంలో, అవయవాలను కదిలించడంలో ఇలా అనేక ముఖ్యమైన విధులను నరాల కణాలు నిర్వర్తిస్తాయి. కనుక నరాల కణాలను దెబ్బతినకుండా, నశించకుండా కాపాడుకోవాలి. నరాల కణాలు మరియు నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలన్నా, ఇవి చురుకుగా పని చేయాలన్నా మనం బెండకాయలను ఆహారంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
నరాల కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో బెండకాయ చక్కగా పని చేస్తుందని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు. బెండకాయలో ఉండే పాలీఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు నరాల కణజాలాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి దెబ్బతినకుండా కాపాడడంలో, కణాలల్లో వచ్చిన ఇన్ ప్లామేషన్ ను తగ్గించడంలో,నరాల కణాల జీవితకాలాన్ని పెంచడంలో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. మెదడు ఎక్కువ కాలం చురుకుగా పని చేయాలన్నా, నాడీ వ్యవస్థ చురుకుగా పని చేయాలన్నా బెండకాయలను తీసుకోవడం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల బెండకాయలను తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి, మేధాశక్తి, చురుకుదనం పెరుగుతుందని 2018 లో స్పెయిన్ దేశ శాస్త్రవేత్తలు నిరూపించారు. మనలో చాలా మంది బెండకాయలను ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. అయితే బెండకాయలను నూనెలో వేసి డీప్ ప్రై చేయడం వల్ల వాటిలో ఉండే పోషకాలు నశిస్తాయి. కనుక వీటిని తక్కువ నూనెలో ఉడికించి తీసుకోవడం మంచిదని అప్పుడే వీటి వల్ల కలిగే ప్రయోజనాలను మనం పొందగలుగుతామని నిపుణులు చెబుతున్నారు.