Chuduva Recipe : అటుకుల గురించి చాలా మందికి తెలిసిందే. ఇవి మనకు అన్ని వేళలా అందుబాటులో ఉంటాయి. అటుకులతో చాలా మంది అనేక రకాల వంటకాలను చేస్తుంటారు. వీటితో చాలా మంది మిక్చర్, చుడువ వంటివి చేస్తుంటారు. అయితే చుడువ ఎప్పుడు చేసినా కొందరు సరిగ్గా చేయలేకపోతుంటారు. సరైన టేస్ట్ రాదు. కానీ కింద చెప్పిన స్టైల్‌లో ఒక్కసారి చుడువను చేసి చూడండి. ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్లీ మళ్లీ ఇలాగే చేసుకుని తింటారు. ఇక చుడువ తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో, దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చుడువ తయారీకి కావల్సిన పదార్థాలు..
అటుకులు – అర కేజీ, వేరుశెనగ, పుట్నాల పప్పు – అర కప్పు చొప్పున, జీలకర్ర, ఆవాలు – ఒక టీస్పూన్ చొప్పున, కారం, పసుపు – అర టీస్పూన్ చొప్పున, ఉప్పు – తగినంత, వెల్లుల్లి రెబ్బలు – 6, వెల్లుల్లి తురుము – 1 టీస్పూ్, ఎండు మిర్చి – 3, పచ్చి మిర్చి చీలికలు – 6, కరివేపాకు రెమ్మ – 1.
చుడువను తయారు చేసే విధానం..
స్టవ్ మీద మందపాటి పాత్ర పెట్టి అటుకులను కలుపుతూ గోధుమ రంగులోకి వచ్చేంత వరకు వేయించాలి. తరువాత వీటిని ప్లేట్‌లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. కడాయిలో నూనె పోసి వేడెక్కిన తరువాత వేరశెనగ పప్పు వేయాలి. అవి దోరగా వేగాక పుట్నాల పప్పు వేయాలి. దీంట్లోనే ఆవాలు, జీలకర్ర, పచ్చి మిర్చి చీలికలు, ఎండు మిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా వేయించాలి. తరువాత కరివేపాకు, పసుపు, కారం, ఉప్పు, అటుకులు వేసి బాగా కలపాలి. చివరగా వెల్లుల్లి తురుము వేయాలి. రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. అంతే ఎంతో రుచిగా ఉండే అటుకుల చుడువ రెడీ అవుతుంది. దీన్ని నేరుగా అలాగే తినవచ్చు. లేదా పచ్చి ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర చల్లి, నిమ్మరసం పిండి కూడా తినవచ్చు. ఎలా తిన్నా సరే చుడువ చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. సాయంత్రం సమయంలో దీన్ని చేసుకుంటే ఒక పట్టు పట్టవచ్చు.