కళ్ళు పొడిబారడం అంటే కళ్లలో ఉండే తేమ ఆరిపోవడం. మన కళ్లను ఎప్పుడూ తడిగా ఉంచేందుకు కొన్ని రకాల ద్రవాలు స్రవించబడతాయి. వాటితో కళ్లపై భారం పడకుండా ఉంటుంది. అయితే కళ్లలో ఉండే ఆ ద్రవాలు ఎండిపోతాయి. దీంతో కళ్లు పొడిబారతాయి. కళ్లు పొడి బారేందుకు అనేక కారణాలు ఉంటాయి.
కళ్లకు సరైన లక్షణ లేకపోవడం, దుమ్ము, ధూళిలో ఎక్కువగా గడపడం, కంప్యూటర్లు, ఫోన్లు, టీవీలను అతిగా చూడడం వంటి కారణాల వల్ల కళ్లు పొడిబారుతుంటాయి. కళ్లలో ఉండే తేమ పోతుంది. ఈ క్రమంలో కళ్లు పొడిగా మారి ఎరుపెక్కి దురదలు పెడతాయి. అయితే కొన్ని సందర్భాల్లో వేడి వాతావరణంలో ఉండడం కూడా కళ్లు పొడిబారేందుకు కారణం అవుతుంది.
కళ్లు పొడిబారితే కళ్లలో దురదలు వస్తాయి. కళ్లు ఎర్రగా మారుతాయి. తలనొప్పి, కళ్ల నొప్పి, మంట, మసక మసకగా కనిపించడం, ఆందోళన, నిద్ర పోయినప్పుడు రెప్పలు పూర్తిగా మూసుకోకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే కొన్ని జాగ్రత్తలను తీసుకుంటే ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు.
* కళ్లపై ఆవిరి పట్టడం ద్వారా పొడిబారిన కళ్లు మళ్లీ సాధారణం అవుతాయి.
* గోరు వెచ్చని నీళ్లను వాటర్ బ్యాగ్‌లో పోసి ఆ బ్యాగ్‌ను కళ్లపై ఉంచి మసాజ్ చేసినట్లు రాయాలి. దీంతో కూడా కళ్లు పొడిబారడం తగ్గుతుంది.
* గోరు వెచ్చని నీళ్లతో సమస్య తగ్గకపోతే చల్లని, శుభ్రమైన నీళ్లను ఉపయోగించాలి. దీంతో కళ్లు సాధారణ స్థితికి వస్తాయి.
* కంప్యూటర్ల ఎదుట ఎక్కువ సేపు కూర్చుని పనిచేసేవారు 20-20-20 రూల్‌ను పాటించాలి. అంటే.. 20 నిమిషాలకు ఒకసారి 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలో ఉండే వస్తువులను చూడాలి. దీంతో కళ్లపై భారం పడకుండా అడ్డుకోవచ్చు. కళ్లు పొడిబారకుండా ఉంటాయి.
* అవిసె గింజలు, సోయాబీన్, చియా విత్తనాలు, చేపలు, వాల్ నట్స్, కోడిగుడ్లలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. అందువల్ల వీటిని తరచూ తింటుంటే కంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.