Bread Paneer Garelu : సాయంత్రం సమయంలో చాలా మంది బయట లభించే చిరుతిండ్లను తినేందుకు ఇష్టపడుతుంటారు. అయితే బయటి తిండి ఎంత హానికరమో అందరికీ తెలిసిందే. దీని వల్ల మన ఆరోగ్యం పాడవుతుంది. జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫుడ్ పాయిజనింగ్ కూడా జరగవచ్చు. కనుక ఇంట్లోనే ఏ ఫుడ్‌ను అయినా తయారు చేసి తినాలి. ఇక సాయంత్రం చేసుకునే స్నాక్స్ విషయానికి వస్తే.. బ్రెడ్ పనీర్ గారెలు ఎంతో టేస్టీగా ఉంటాయని చెప్పవచ్చు. వీటిని తయారు చేయడం కూడా సులభమే. బ్రెడ్ పనీర్ గారెలను ఎలా తయారు చేయాలో, వీటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రెడ్ పనీర్ గారెల తయారీకి కావల్సిన పదార్థాలు..
బ్రెడ్ స్లైసులు – 6, పెరుగు – ముప్పావు కప్పు, బియ్యం పిండి – అర కప్పు, బొంబాయి రవ్వ – పావు కప్పు, పనీర్ తురుము – అర కప్పు, ఉడికించిన బంగాళాదుంప ముద్ద – పావు కప్పు, జీలకర్ర – అర టీస్పూన్, ఉల్లిపాయ తరుగు – పావు కప్పు, అల్లం తరుగు – 1 టీస్పూన్, కొత్తిమీర కట్ట, పచ్చిమిర్చి – 2, ఉప్పు – తగినంత, నూనె – వేయించేందుకు సరిపడా.
బ్రెడ్ పనీర్ గారెలను తయారు చేసే విధానం..
ముందుగా బ్రెడ్ స్లైస్‌లని ముక్కల్లా కోసి ఆ తరువాత మిక్సీలో వేసి పొడి చేయాలి. ఇప్పుడు వెడల్పాటి గిన్నెను తీసుకుని అందులో నూనె తప్ప ఒక్కో పదార్థాన్ని బ్రెడ్ పొడితో సహా వేసుకోవాలి. తరువాత కొద్దిగా కొద్దిగా నీళ్లు పోసుకుంటూ గారెల పిండిలా చేసుకోవాలి. ఈ పిండిని గారెల్లా వేసుకుంటూ కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకుంటే సరి. ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ పనీర్ గారెలు రెడీ అవుతాయి. వీటిని నేరుగా అలాగే తినవచ్చు. లేదా ఏదైనా చట్నీతో కానీ, టమాటా సాస్‌తో కానీ తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటాయి. అందరూ ఇష్టంగా తింటారు.