పూర్వకాలం నుంచి మన పెద్దలు వాస్తు శాస్త్రాన్ని విశ్వసిస్తూ వస్తున్నారు. వాస్తు ప్రకారం ఒక ఇంటిని నిర్మిస్తే అందులో నివసించే వారికి ఎలాంటి సమస్యలు రావని నమ్ముతారు. అయితే వాస్తు ప్రకారమే ఇంటిని నిర్మించుకున్నా మనం మన ఇండ్లలో పెట్టుకునే కొన్ని రకాల వస్తువుల వల్ల వాస్తు దోషాలు ఏర్పడుతుంటాయి. ముఖ్యంగా బెడ్‌రూమ్ లో పెట్టుకునే కొన్ని రకాల వస్తువుల వల్ల వాస్తు దోషం ఏర్పడుతుంది. దీంతో దంపతుల మధ్య లేదా కుటుంబంలో కలహాలు వస్తుంటాయి.
దేవుడు లేదా దేవత అంటే.. చాలా మందికి ఇష్టమే. తమ ఇష్టదైవానికి కొందరు నిత్యం లేదా తరచూ పూజలు చేస్తుంటారు. అయితే ఎంత ఇష్టమైనప్పటికీ దైవానికి చెందిన ఫొటోలు లేదా విగ్రహాలను కేవలం పూజ గదికే పరిమితం చేయాలి. వాటిని బెడ్‌రూమ్‌లో పెట్టకూడదు. పెడితే తీవ్రమైన అపచారం చేసినట్లు అవుతుంది. వాస్తు దోషం ఏర్పడుతుంది. దీంతో ఇంట్లో నివసించే వారికి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా దంపతుల మధ్య లేదా కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఏర్పడుతాయి. ఎల్లప్పుడూ గొడవ పడుతుంటారు.
ఇంట్లో పాడైపోయిన లేదా కాలిపోయిన ఎలక్ట్రిక్ లేదా ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా ఉంచుకోకూడదు. ఇవి నెగెటివ్ ఎనర్జీని కలగజేయడమే కాదు, మన ఆరోగ్యానికి కూడా హాని చేస్తాయి. కనుక వాస్తు ప్రకారం వీటిని కూడా ఇంటి నుంచి తీసేయాలి. ముఖ్యంగా బెడ్‌రూమ్‌లో వీటిని అసలు ఉంచకూడదు. వెంటనే పడేయాలి. అలాగే జలపాతాలు, సముద్రాలకు చెందిన ఫొటోలు, పెయింటింగ్స్‌ను బెడ్‌రూమ్‌లో పెట్టకూడదు. వీటితోపాటు అద్దాలను బెడ్‌రూమ్‌లో బెడ్‌కు ఎదురుగా పెట్టకూడదు. అలాగే బెడ్ రూమ్ లోపలి గోడల రంగు డార్క్ కలర్ ఉండకూడదు. లైట్ కలర్ ఉండాలి. ఈ విధంగా వాస్తు సలహాలను పాటిస్తే వాస్తు దోషం ఏర్పడకుండా ఉంటుంది. దీంతో దంపతుల మధ్య గొడవలు ఏర్పడకుండా ఉంటాయి.