కొత్తిమీరను వాటి విత్తనాలు అయిన ధనియాలను భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే ఉపయోగిస్తున్నారు. ఇవి రెండూ కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను మనకు అందిస్తాయి. కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించగలవు. అలాగే జీర్ణ సమస్యలను నయం చేస్తాయి. కొత్తిమీరను, ధనియాలను మనం రోజూ వంటల్లో రుచి, వాసన కోసం వాడుతుంటాం. అయితే ధనియాల నీళ్లను రోజూ తాగడం వల్ల అద్భుతమైన లాభాలను పొందవచ్చు. ధనియాల నీళ్లను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అర లీటర్ నీళ్లను తీసుకుని అందులో గుప్పెడు ధనియాలను వేసి 10 నిమిషాల పాటు మరిగించాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చాలి. నీళ్లు గోరు వెచ్చగా ఉన్నప్పుడు వడకట్టి తాగేయాలి. రుచి కోసం అందులో కాస్త నిమ్మరసం, తేనె వంటివి కలుపుకోవచ్చు. ఈ నీళ్లను తాగడం వల్ల మనం అనేక లాభాలను పొందవచ్చు. ఈ నీళ్లను ఉదయం పరగడుపునే తాగాల్సి ఉంటుంది. అనంతరం 45 నిమిషాల వరకు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. దీంతో పలు ప్రయోజనాలను పొందవచ్చు.
ధనియాల నీళ్లను తాగడం వల్ల శరీరానికి విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. ఇది కంటి చూపును పెంచుతుంది. ధనియాలలో విటమిన్ సి, ఎ సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతాయి. షుగర్ సమస్యతో బాధపడుతున్నవారు ఈ నీళ్లను తాగడం వల్ల ఫలితం ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి. ధనియాలలో ఉండే క్యాల్షియం ఎముకలను బలంగా మారుస్తుంది. ఈ విధంగా ధనియాల నీళ్లను రోజూ తయారు చేసి తాగుతుంటే ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.