కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్రం కోవిడ్ ఆంక్షలను జనవరి 31వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలే జనవరి 31వ తేదీ వరకు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ యూకే ద్వారా కొత్త కరోనా స్ట్రెయిన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కోవిడ్ ఆంక్షల అమలును పొడిగిస్తున్నట్లు తెలిపింది. దీంతో జనవరి 31వ తేదీ వరకు దేశంలో కోవిడ్ ఆంక్షలు అమలు కానున్నాయి.
ఇక నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జనాలు గుంపులుగా గూడి వేడుకలను జరుపుకునే అవకాశం ఉందని, కనుక అలాంటి విషయాల పట్ల జాగ్రత్తలు పాటించాలని కేంద్ర హోం శాఖ సూచనలు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని, మాస్కులను ధరించాలని సూచించింది. చలికాలం, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా కోవిడ్ కేసులు పెరిగే అవకాశం ఉన్నందున కచ్చితంగా కోవిడ్ ఆంక్షలను అమలు చేయాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది.
కరోనా నేపథ్యంలో కంటెయిన్‌మెంట్ జోన్లను గుర్తించడంతోపాటు, జోన్‌లలో కఠినంగా వ్యవహరించాలని, నిబంధనలను ఉల్లఘించే వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. అలాగే వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న చోట్ల కఠిన నిబంధనలను అమలు చేయాలని, నవంబర్ 25వ తేదీన కేంద్ర హోం శాఖ, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన మార్గదర్శకాలనే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అమలు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.