మొబైల్ ఫోన్, టీవీ, ల్యాప్ టాప్, వాషింగ్ మెషిన్.. ఇలా ఏ ఎలక్ట్రికల్ వస్తువులనైనా ఓ సారి పరిశీలించండి. వాటి పవర్ బటన్ సింబల్స్ మాత్రం ఇలాగే ఉంటాయి. ఎందుకు అలా అంటే.. దీని వెనుక ఓ అర్థవంతమైన లాజిక్ ఉంది. ఇప్పుడు మనం దానిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి వస్తువు పేరు వెనుక, ప్రతి ఎలక్ట్రికల్ సింబల్ వెనుక ఓ లాజిక్ ఉంటుంది. అదేంటో తెలుసుకోగలిగితే.. ఓస్ ఇంతేనా.. అని అనుకుంటాం. ఈ పవర్ బటన్ వెనుక ఉన్న లాజిక్ కూడా చాలా అర్థవంతంగా ఉంటుంది, కానీ మనలో చాలా మందికి ON/OFF బటన్స్ మీద ఈ సింబలే ఎందుకు ఉంటుందో తెలియదు. ఇప్పుడు ఈ లాజిక్ ను తెలుసుకుందాం.
ఈ సింబలే కదా..ప్రతి పవర్ బటన్ కు ఉండేది. ఇలాగే ఎందుకు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఓ సారి పై సింబల్ ను జాగ్రత్తగా పరిశీలించండి. ఓ సర్కిల్ లోకి ఓ లైన్ ను ఇరికించినట్టుంది కదా… వాటిని వేరు వేరుగా చూస్తే.. అవి: O, I లు. ఇప్పుడు ఇంకాస్త డెప్త్ గా వెళదాం. అవి 1, 0 లు. రెండవ ప్రపంచ యుద్ద సమయంలో ఇంజనీర్లు తమ ఎలక్ట్రిక్ వస్తువులకు ఈ సింబల్ ను సూచించారు. ఎందుకు 1, 0 లు మిళితమైన ఈ సింబల్ ను చూపించారంటే.. కంప్యూటర్ బేసిక్ గా బైనరీ కోడ్ మీద నడిచేది. అంటే.. ప్రతి సమాచారాన్ని 0, 1 ల రూపంలో సేవ్ చేసుకునేది. దీనిని బట్టి లాజిక్ గేట్ ల నిర్మాణం ఉండేది.
అంటే 1 అంటే ఆన్ అని.. 0 అంటే ఆఫ్ అని అర్థం. ఆన్ అండ్ ఆఫ్ కు అదే బటన్ ను యూజ్ చేస్తాము కాబట్టి 1, 0 అనే అంకెలు మిళితమై ఉంటాయన్న మాట. చివరగా 1973 లో ఇంటర్నేషనల్ ఎలెక్ట్రో టెక్నికల్ కమీషన్ ( IEC) ఈ పవర్ బటన్ సింబల్ ను ఆమోదించింది. ఇప్పటికీ చాలా దేశాల్లోని స్విచ్ ల మీద 0, 1 నంబర్స్ ఉంటాయి, మన దగ్గర On/Off లాగా. ఇదిగో ఇదన్నమాట పవర్ బటన్ వెనుక ఉన్న అసలైన లాజిక్.