Pedarayudu Movie : పెదరాయుడు మూవీ మోహన్ బాబు నట జీవితంలో అతి పెద్ద సక్సెస్ అనే చెప్పాలి. ఈ సినిమా ఇండస్ట్రీలో రికార్డ్స్ తిరగరాసింది. అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డ్స్ ఈజీగా పెదరాయుడు మూవీ క్రాస్ చేసింది. పెదరాయుడు సినిమాలో మోహన్ బాబు పెదరాయుడుగా, ఆయన తమ్ముడు రాజాగా ద్విపాత్రాభినయంలో నటించి ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా ఈ చిత్రంలో భార్య భర్తల బంధం, అన్నదమ్ముల అనుబంధం, తల్లి తండ్రులతో కొడుకల అనుబంధాన్ని ఈ సినిమాలో చక్కగా చూపించారు.
1994లో తమిళంలో నాట్టమై అనే సినిమాలో విజయ్ కుమార్ వంటి సాధారణ నటుడు చేసిన పాత్రను తెలుగులో సూపర్ స్టార్ రజినీకాంత్ మోహన్ బాబుతో ఉన్న స్నేహం కారణంగా నటించారు. అంతేకాదు తమిళంలో హిట్టైన నాట్టమై చిత్రాన్ని తెలుగులో తీయమని మోహన్ బాబుకు సలహా ఇచ్చింది కూడా రజనీకాంత్ కావడం విశేషం. స్నేహితుడి మాట కాదనలేక పెదరాయుడు సినిమా కోసం రీమేక్‌లో సిద్ధహస్తుడైన రవిరాజా పినిశెట్టిని దర్శకుడిగా తీసుకున్నారు. అప్పటికే వరుస ప్లాప్‌లతో సతమతమవుతున్న మోహన్‌బాబు లైప్ అండ్ డెత్ గేమ్‌లాగా తన సొంత బ్యానర్ మీదే ఈ సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు మోహన్‌బాబు. ఈ సినిమాలో నటించినందకు అప్పటిలో రజినీకాంత్ కూడా ఎలాంటి పారితోషకం తీసుకోలేదు.
15 జూన్ 1995లో పెదరాయుడు విడుదలై ఘన విజయం సాధించింది. పెదరాయుడుగా మోహన్ బాబు వేసిన ముద్ర అప్పట్లో చాలా కాలం వేరే హీరోలు అలాంటి పాత్రలు మరికొన్ని వేసినా అంతగా ఆకట్టుకోలేదు. మోహన్‌బాబు అంత గొప్పగా ఆ పాత్రలో జీవించారు. ఈ సినిమాలో పాపారాయుడు పాత్రలో రజినీకాంత్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో ప్లాష్‌బాక్‌లో 20 నిమిషాల పాటు పాపారాయుడు పాత్రలో చెలరేగిపోయిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక ఎత్తు. రజీనికాంత్ ఎపిసోడ్ కోసమే ఒకటికి పది సార్లు సినిమాను చూసిన ప్రేక్షకులు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
పెదరాయుడు విడుదలైన అదే రోజు మెగాస్టార్ చిరంజీవి బిగ్‌బాస్ మూవీ కూడా విడుదల అయింది. మెగాస్టార్ దెబ్బకు పెదరాయుడు నిలబడుతుందా అనుకున్నారు అప్పటిలో అందరూ. కానీ మొదటి వారంలోనే సీన్ రివర్స్ అయింది. రెండు సినిమాలు విడుదలై రెండు, మూడు రోజులు గడిచాయి. క్రమ క్రమంగా సినిమా హాళ్లు బిగ్‌బాస్‌కు తగ్గి పెదరాయుడుకి క్యూలు పెరిగాయి. ముఖ్యంగా థియేటర్లు టికెట్ల కోసం జనాలు కొట్టుకున్నారు. పెదరాయుడు ప్రింట్ల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. డబ్బు లెక్కపెట్టుకోవడానికి మిషన్లు కావాలి అనేంతగా కలెక్షన్లు వర్షం కురిపించింది. పెదరాయుడు సినిమా ధాటిని తట్టుకోలేక చిరంజీవి బిగ్‌బాస్ సినిమా జెండా ఎత్తేసింది. అప్పటివరకు ఘరానా మొగుడు సినిమాపై ఉన్న రికార్డులన్నింటీనీ పెదరాయుడు తిరగరాసింది. 39 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకొని ఆల్టైమ్ రికార్డులను బ్రేక్ చేసింది పెదరాయుడు చిత్రం.