డబ్బు అంటే సాక్షాత్తూ లక్ష్మీదేవి స్వరూపం. అందువల్ల డబ్బు విషయంలో పలు నియమాలను పాటించాల్సి ఉంటుంది. డబ్బు పట్ల ఎల్లప్పుడూ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించరాదు. డబ్బు కింద పడితే వెంటనే తీసి కళ్లకు అద్దుకుని జేబులో లేదా పర్సులో వేసుకోవాలి. అంతేకానీ.. డబ్బు పట్ల అశ్రద్ధను ప్రదర్శించరాదు. లేదంటే అరిష్టం కలుగుతుంది.
ఇక ఇంట్లో చాలా మంది డబ్బును ఎక్కడ పడితే అక్కడ పెడుతుంటారు. బయటకు వెళ్లి వచ్చాక చేతిలో ఏదైనా చిల్లర మిగిలితే దాన్ని వంట ఇంట్లో లేదా హాల్‌లో, దిండు కింద.. ఇలా ఎక్కడ పడితే అక్కడ కొందరు పెడతారు. ఇలా చేయరాదు. చేస్తే లక్ష్మీ దేవి ఆగ్రహిస్తుంది. డబ్బు నష్టం కలుగుతుంది. మరి ఇంట్లో డబ్బును ఎక్కడ పెట్టాలంటే..
ఇంట్లో కుటుంబ పెద్ద ఉపయోగించే మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఉండే బీరువాలో డబ్బును ఉంచాలి. బయటకు వెళ్లి వచ్చినప్పుడు చేతిలో ఏదైనా చిల్లర ఉంటే ఆ బీరువాలో పెట్టాలి. అక్కడి నుంచే డబ్బును తీసి వాడాలి. బీరువా లేకపోతే అదే బెడ్ రూమ్‌లో ఉండే అల్మారాలో డబ్బును ఉంచాలి. అల్మారాకు తలుపులు ఉండేలా చూసుకోవాలి. లేదా పై భాగంలో ఉండే కప్‌బోర్డులో కూడా డబ్బును పెట్టవచ్చు. నాణేలు, నోట్లు ఏవైనా సరే ఆయా ప్రదేశాల్లోనే ఉంచాలి.
డబ్బును ఎట్టి పరిస్థితిలోనూ వంట గదిలో ఉంచరాదు. చాలా మంది మహిళలు ఇలాగే చేస్తారు. కొందరు దిండు కింద డబ్బును పెడతారు. అలా కూడా చేయరాదు.
ఇక బయటకు వెళ్లి వచ్చేటప్పుడు ముందుగా మనం ఇంట్లో హాల్ లోకి ప్రవేశిస్తాం కనుక హాల్ లోకి రాగానే కుడి వైపు ఉండే ప్రదేశంలోని ఏదైనా షెల్ప్ లేదా టేబుల్‌పై ఒక బాక్స్ లాంటిది ఉంచి అందులో కూడా డబ్బును పెట్టుకోవచ్చు. దానికి మూత కచ్చితంగా పెట్టాలి. ఎవరైనా బయటికి వెళ్లి వచ్చినప్పుడు చిల్లర ఉంటే అందులో వేయవచ్చు. లేదా డబ్బును అందులో ఉంచి దాని ద్వారా డబ్బును బయటకు తీసి ఆ డబ్బును ఖర్చు పెట్టాలి. ఈ విధంగా డబ్బు విషయంలో నియమాలను పాటించాలి. దీంతో మనకు డబ్బు మీద శ్రద్ధ ఉందని లక్ష్మీదేవి భావిస్తుంది. మనకు సంపదలను అనుగ్రహిస్తుంది.