చలికాలంలో సహజంగానే మనకు తిన్న ఆహారం జీర్ణమవడంలో ఇబ్బందులు తలెత్తుతుంటాయి. కొందరికి ఆహారం నెమ్మదిగా జీర్ణమవుతుంటుంది. ఇక కొందరికైతే అసలు జీర్ణం కాదు. జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అలాంటి వారు ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడాల్సిన పనిలేదు. మన ఇండ్లలో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతోనే అజీర్ణం సమస్యకు చెక్ పెట్టవచ్చు. వాటిని తీసుకుంటే జీర్ణ ప్రక్రియ సాఫీగా జరుగుతుంది. ఇతర జీర్ణ సమస్యలు కూడా పోతాయి. మరి అజీర్ణాన్ని తగ్గించే ఆ చిట్కాలు ఏమిటంటే…
అల్లం, ఉప్పు, నిమ్మరసం…
అల్లం రసం, నిమ్మరసం కొద్ది కొద్దిగా తీసుకుని కలిపి అందులో ఉప్పువేసి తీసుకోవాలి. దీంతో ఆహారం వెంటనే జీర్ణమవుతుంది. ఈ మూడు పదార్థాలు మన ఇండ్లలో ఎప్పుడూ ఉంటాయి. కనుక వెంటనే సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అల్లం మన శరీరంలో ఉండే విష పదార్థాలను బయటకు పంపుతుంది. ఈ క్రమంలో జీర్ణ ప్రక్రియ మెరుగు పడుతుంది.
జీలకర్ర, వాము…
అజీర్ణ సమస్యకు జీలకర్ర, వాములు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిని కొద్ది కొద్దిగా తీసుకుని బాగా కలిపి నేరుగా తినాలి. లేదా కషాయం రూపంలో చేసుకుని తాగవచ్చు. గోరు వెచ్చని నీటిలో వీటిని బాగా కలిపి తాగవచ్చు. ఎలా తీసుకున్నా జీర్ణ సమస్య నుంచి బయట పడవచ్చు. దీంతోపాటు అసిడిటీ, గ్యాస్, కడుపులో మంట కూడా తగ్గుతాయి.
పుదీనా టీ…
పుదీనాలో యాంటీ స్పాస్‌మోడిక్ గుణాలు ఉంటాయి. అందువల్ల అజీర్ణ సమస్య నుంచి వెంటనే బయట పడవచ్చు. అందుకు గాను పుదీనాతో టీ తయారు చేసుకుని తాగాలి. లేదా పుదీనా రసాన్ని కూడా తీసుకోవచ్చు. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమై జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
దాల్చినచెక్క…
దాల్చినచెక్కలో యుజినాల్, లినలూల్, సినమాల్డిహైడ్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి అజీర్ణ సమస్యను తగ్గిస్తాయి. సమస్య నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. గోరు వెచ్చని నీటిలో దాల్చిన చెక్క పొడి కలుపుకుని తాగితే ఫలితం ఉంటుంది.
లవంగాలు…
తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే వెంటనే 1, 2 లవంగాలను నోట్లో వేసుకుని బాగా నమిలి మింగాలి. దీంతో అజీర్ణం నుంచి బయట పడవచ్చు. అలాగే వికారం, వాంతులు వంటి సమస్యలు తగ్గుతాయి.
అలొవెరా (కలబంద)…
అజీర్ణ సమస్య ఉన్నవారు అలొవెరా గుజ్జును తినవచ్చు. లేదా జ్యూస్‌ను తాగవచ్చు. దీంతో శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. అజీర్ణం నుంచి ఉపశమనం లభిస్తుంది.
కొబ్బరినీళ్లు…
అజీర్ణ సమస్యకు కొబ్బరినీళ్లు కూడా చక్కని పరిష్కారాన్ని చూపుతాయి. కొబ్బరినీళ్లను తాగడం వల్ల జీర్ణాశయంలో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. అజీర్ణం తగ్గుతుంది. గ్యాస్, అసిడిటీ ఉండవు. ప్రతి 4 గంటలకు ఒకసారి ఒక గ్లాస్ కొబ్బరి నీటిని తాగుతూ ఉంటే సమస్య నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.
అజీర్ణం సమస్య ఉన్న వారు నీటిని బాగా తాగుతుండాలి. దీంతో గ్యాస్ ఏర్పడకుండా ఉంటుంది. అలాగే ఆహారం జీర్ణం అయ్యేందుకు నీరు ఉపకరిస్తుంది. ఇక అజీర్ణం సమస్య తగ్గే వరకు కారం, మసాలాలు ఉన్న ఆహారాలను తినరాదు. బదులుగా మజ్జిగ ఎక్కువగా తాగాల్సి ఉంటుంది. దీంతో అజీర్ణం సమస్యను త్వరగా తగ్గించుకోవచ్చు.