Phone Beside Bed : స్మార్ట్‌ఫోన్.. ఇప్పుడిది అందరికీ మద్యపానం, ధూమపానంలా ఓ వ్యసనంగా మారింది. ఉదయం నిద్ర లేచింది మొదలు మళ్లీ రాత్రి పడుకునే వరకు, ఇంకా చెబితే బెడ్ పక్కనే ఎప్పటికీ అందుబాటులో స్మార్ట్‌ఫోన్‌ను ఉంచి పడుకోవడం ఇప్పుడు అందరికీ అలవాటైపోయింది. ఈ క్రమంలో మొబైల్ ఫోన్స్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల శరీరం అనారోగ్యాలకు గురవుతుందని ఇంతకు ముందు నుంచే వైద్యులు హెచ్చరిస్తూ వస్తున్నారు. అయితే కొందరు సైంటిస్టులు చేసిన తాజా పరిశోధనల్లో తెలిసింది ఏమిటంటే.. రాత్రి పూట ఫోన్‌ను వాడడం, లేదా పక్కనే పెట్టుకుని నిద్రించడం వంటి పనులు చేస్తే అలాంటి వారికి సంతానం కలిగేందుకు చాలా తక్కువగా అవకాశం ఉంటుందని తెలిసింది. అవును, మీరు విన్నది నిజమే.
కాలిఫోర్నియా యూనివర్సిటీ, ఒకాసా యూనివర్సిటీ, జపాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజన్సీ వంటి యూనివర్సిటీలు, సంస్థలు రాత్రి పూట సెల్‌ఫోన్ వాడకం, దాని వల్ల కలిగే ప్రభావాలపై ఇటీవల పరిశోధనలు చేశాయి. ఇందులో భాగంగా వారు కొన్ని ఎలుకలను తమ పరిశోధనకు ఎంచుకున్నారు. వాటిలో కొన్నింటిని అలాగే వదిలేయగా, మరికొన్నింటిపై సెల్‌ఫోన్ డిస్‌ప్లే నుంచి వచ్చే కాంతిని ప్రసారం చేశారు. ఈ క్రమంలో చివరకు తెలిసిందేమిటంటే సాధారణ ఎలుకలు రుతుక్రమం వచ్చే సరికి 71 శాతం సంతానోత్పత్తికి అనుకూలంగా ఉన్నాయని, అదే కాంతి ప్రసారం చేయబడ్డ ఎలుకల సంతానోత్పత్తి 10 శాతానికి పడిపోయిందని గుర్తించారు. అంటే సెల్‌ఫోన్ డిస్‌ప్లే నుంచి వచ్చే కాంతి వల్ల ఎలుకల్లో సంతానోత్పత్తి అవకాశం 60 శాతానికి పైగా పడిపోయిందని తేల్చారు. అయితే ప్రయోగాలు ఎలుకలపై చేసినా, మనుషులకు కూడా ఇది వర్తిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
రాత్రి పూట సెల్‌ఫోన్ వాడకం వల్ల, ఫోన్‌ను పక్కనే పెట్టుకుని నిద్రించడం వల్ల సంతానోత్పత్తిపై ప్రభావం పడడమే కాదు, ఇంకా ఎన్నో ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తాయట. మన శరీరంలో జరిగే జీవక్రియలకు ఆటంకం కలుగుతుందట. హార్మోన్లు అసమతుల్యంగా మారుతాయట. నిద్ర సరిగ్గా పట్టదట. శరీరానికి ముఖ్యంగా కావల్సిన మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుందట. నీరసం, గుండె పోటు, గుండె సంబంధ వ్యాధులు, ఊబకాయం, మధుమేహం వంటి అనారోగ్యాలు వచ్చేందుకు అవకాశం ఉంటుందట. అంతే కాదు చర్మం త్వరగా ప్రభావితమై వృద్ధాప్య సంకేతాలు కనబడతాయట. కనుక, సెల్‌ఫోన్‌ను రాత్రి పూట వాడడం మానేయండి. అంతేకాదు, దాన్ని పక్కన పెట్టుకుని కూడా నిద్రించకండి.