Thippa Theega : తిప్ప తీగ.. గ్రామాల్లో ఉండే వారికి దీని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. తిప్పతీగను అమృతవల్లి అని కూడా పిలుస్తారు. తిప్పతీగకు చావు లేదని పెద్దలు చెబుతూ ఉంటారు. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను, వ్యాధులను నయం చేయడంలో తిప్ప తీగ మనకు ఎంతో సహాయపడుతుంది. ఆయుర్వేదంలో తిప్పతీగను విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటారు. ప్రస్తుత కాలంలో వైరస్ దాడులను ఎదుర్కోవడానికి ఈ తిప్ప తీగను మరింత ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. త్వరగా రక్తంలో కలిసే దీని గుణం ముఖ్యంగా శరీరంలో వ్యాధి నిరోధకతను పెంచడంలో దోహదపడుతుంది. దీనిలో 15 రకాల ఆల్కలాయిడ్స్, 6 రకాల గ్లైకోసైడ్స్, 5 రకాల డైటర్ఫినాయిడ్స్, 4 రకాల స్టెరాయిడ్స్, 5 రకాల ఆలిఫాటిక్ సమ్మేళనాలు ఉన్నాయని నిపుణులు పరిశోధనల ద్వారా తెలియజేసారు.
ఇవి అన్నీ కూడా తెల్లరక్తకణాల స్థితిగతులను మెరుగుపరిచి, తెల్ల రక్తకణాల ఉత్పత్తిని పెంచి శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగుపడేలా చేయడంలో దోహదపడతాయని వారు చెబుతున్నారు. అలాగే శరీరంలో ప్రవేశించిన వైరస్, బ్యాక్టీరియాలను భక్షించే మాక్రోఫేస్ కణాల సంఖ్యను పెంచడంలో కూడా తిప్ప మనకు తోడ్పడుతుంది. అలాగే రక్షణ వ్వవస్థలో సమాచారాన్ని అందించే టి హెల్పర్ కణాల సంఖ్యను మెరుగుపరచడంలో కూడా తిప్పతీగ మనకు దోహదపడుతుంది. ఈ కణాలు ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలోకి వైరస్ లు ప్రవేశించగానే రక్షణ వ్యవస్థకు సమాచారం త్వరగా చేరుతుంది. దీంతో మన శరీరంలోకి ప్రవేశించిన వైరస్ లు వెంటనే నశిస్తాయి. అలాగే మన శరీరంలో యాంటీ బాడీస్ ను బి కణాలు ఉత్పత్తి చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే.
తిప్పతీగను వాడడం వల్ల బి కణాలు యాంటీ బాడీస్ తో పాటు వాటి పనితీరు మెరుగుపరచడానికి అవసరమయ్యే కొన్ని రకాల ఎంజైమ్ లను కూడా ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేస్తాయి. దీంతో మనం వైరస్, బ్యాక్టీరియా దాడుల నుండి త్వరగా బయటపడవచ్చు. అయితే ఈ తిప్పతీగను ఎలా వాడడం వల్ల మనకు మేలు కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. తిప్ప తీగ ఆకులను దంచి ముద్దగా చేసుకుని నేరుగా తినవచ్చు. అలాగే ఆకుల నుండి రసాన్ని తీసి ఆ రసాన్ని తాగవచ్చు. అలాగే మనకు మార్కెట్ లో తిప్పతీగ పొడి కూడా లభిస్తుంది.
ఈ పొడిని ఒక స్పూన్ మోతాదులో ఒక లీటర్ నీటిలో వేసి కలపాలి. తరువాత ఈ నీటిని అర లీటర్ అయ్యే వరకు మరిగించి వడకట్టాలి. తరువాత ఈ నీటిని రోజులో రెండు సార్లు తీసుకోవాలి. అలాగే ఈ ఆకుల పొడికి తేనెను కలిపి ఉండలాగా చేసుకోవాలి. ఈ ఉండలను తీసుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. అలాగే తిప్ప తీగ జ్యూస్ మనకు మార్కెట్ లో లభిస్తుంది. ఈ జ్యూస్ ను 15 ఎమ్ ఎల్ మోతాదులో ఒక లీటర్ నీటిలో వేసి కలిపి తాగవచ్చు. ఈ విధంగా తిప్పతీగ మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎంతగానో సహాయపడుతుందని దీనిని వాడడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను చాలా సులభంగా దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.