Hanuman : హనుమంతుడికి సింధూరం అంటే చాలా ఇష్టం అన్న విషయం మనకి తెలుసు. అయితే హనుమంతుడుని ఎందుకు సింధూర ప్రియుడు అని పిలుస్తారు..? దాని వెనుక కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత ఓనాడు సీతమ్మ తలస్నానం చేసి నుదుట తిలకం దిద్ది, పాపిట సింధూరం పెట్టుకుని శ్రీరామునితోపాటుగా విశ్రాంతి మందిరానికి వెళ్తున్నప్పుడు, శ్రీరాముని సేవకి హనుమంతుడు వేచి ఉంటాడు. ఇది గమనించిన సీతారాములు వెనక్కి తిరిగి చూస్తారు. సీతా దేవి హనుమంతునితో, మేము విశ్రాంతి మందిరానికి వెళ్తున్నాము.
నువ్వు రాకూడదు హనుమాన్ అని చెప్తుంది. రాములవారు కూడా సీత చెప్పినట్లు చేయమని, హనుమాన్ ఇప్పుడు రావద్దు అని అంటారు. మిమ్మల్ని సేవించకపోతే, నాకు కునుకు పట్టదు కదా.. సీత చెప్పినట్లే, మీరు కూడా చెప్తున్నారు.. అంటాడు. అప్పుడు రాములవారు హనుమంతుడితో పెళ్ళప్పుడు ఆమె పాపిట చిటికెడు సింధూరం పెట్టాను. ఆ కారణంగా ఆమెకి దాసుడునైతిని అని చెప్తాడు.
అమ్మ నీ నుదుట తిలకముంది కదా..? పాపిట సింధూరం దేనికి అని అడుగుతాడు. నాయనా హనుమ, స్వామి వారికి ఇంకా సౌభాగ్యం కలగాలని సింధూరం పెట్టుకున్నానని చెప్తుంది. వెంటనే అంగడికి వెళ్లి, హనుమంతుడు సింధూరాన్ని తీసుకుని మొత్తం ఒళ్లంతా కూడా పెట్టుకుంటాడు. వెంటనే సీతారాముల దర్బార్ కి పట్టరాని ఆనందంతో వెళ్తాడు.
హనుమంతుడు అలా సింధూరం మొత్తం రాసుకోవడంతో, అక్కడ వాళ్ళందరూ నవ్వుతారు. శ్రీరామచంద్రుడు చిరునవ్వుతో హనుమా ఇదేంటి అని అడిగితే.. మీరు చిటికెడు సింధూరంని సీతాదేవికి అలంకరించుట చేతనే ఆమెకు వశపడితిరి. చిటికెడు సింధూరంతోనే సౌభాగ్యం కలిగితే, నేను శరీరం మొత్తం సింధూరముని అలంకరించుకున్నాను. మరి మీరు నాకు వశపడితిరా ప్రభు అని అంటాడు హనుమంతుడు.. అలా రాముని మెప్పు కోసం, ఆయనపై ఉన్న భక్తిచే అప్పటి నుంచి హనుమ సింధూరాన్ని ధరించడం మొదలు పెట్టాడు. కనుకనే భక్తులు సింధూరాన్ని ధరిస్తే హనుమ సంతోషించి వారిని అనుగ్రహిస్తాడని చెబుతారు.