Yawning : ఆవలింత.. ఆవలింత.. ఆవలింత.. ఆవలింత.. ఇలా కంటిన్యూయెస్ గా ఓ 10 సార్లు అనండి. మీకు కచ్చితంగా ఆవలింత వస్తుంది. ఇదే ఆవలింతలో ఉన్న మ్యాజిక్, కానీ దీని వెనకున్న లాజిక్ ను మాత్రం మన సైంటిస్టులు ఇంకా కనుక్కోలేకపోయారు. ఇంకా అంతుచిక్కని ఆవలింతపై ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే వైద్యులు చెబుతున్న దాని ప్రకారం శరీరం అలసటకు లోనైనప్పుడు ఈ ఆవలింతలు వస్తాయి. ఆవలింతలు అంటు వ్యాధి రకానికి చెందినవి కాకపోయినా.. ప్రతిస్పందనల రకానికి చెందిన ఆరోగ్యకరమైన చర్య అని చెప్తారు. అంటే ఆవలించే ఇతర వ్యక్తులను చూసినప్పుడు మనలో కూడా ఆటోమేటిక్ గా ఆవలింతలొస్తాయన్నమాట.
అసలు ఆవలింతలు ఎప్పుడెప్పుడు వస్తాయంటే.. శరీరం పూర్తిగా అలసిపోయి నిద్రకు వేళాయే అని పిలిచినప్పుడు ఆవలింతలు వాటంతట అవే వస్తాయి. మనుషులకే కాదు జంతువులకు కూడా ఆవలింతలు వస్తాయి. ఆవలింత తల్లి గర్భంలో ఉండగానే మొదలవుతుందంట. 11 వారాల వయసున్న గర్భస్థ శిశువు కూడా ఆవలిస్తుందని అధ్యయనాలు చెప్తున్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే భూమి మీదకు రాక ముందే ఆవలింత మనకి దగ్గరవుతుందన్న మాట. అంటే ఆవలింతే మన ఫస్ట్ ఫ్రెండ్. నిద్ర ముంచుకు వస్తుందని తెలపడమే కాదు.. నిద్రలో ఉన్న శరీరాన్ని రీఫ్రెష్ చేసేందుకు కూడా ఆవలింత వస్తుందట. ఈ ఆవలింతతో శరీరానికి ఉండే లేజీ నెస్ వెళ్లిపోతుంది.
మనకి బోర్ కొట్టినప్పుడు లేదా నిద్ర ముంచుకు వచ్చినప్పుడు ఆవలింత వస్తుంది. బుక్స్ చదివేటప్పుడు చాలా మంది ఆవలించడాన్ని గమనించే ఉంటారు. అయితే ఆవలించడం వల్ల మెదడుకి రక్త ప్రసరణ బాగా జరిగి మెదడు మరింత షార్ప్ గా పనిచేస్తుంది. మనకు ఎక్కువ ఆవలింతలు వస్తున్నాయంటే దానర్థం, మెదడు తనని తాను యాక్టివ్ గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుందని అర్థం. మనకొచ్చే ఒక్కో ఆవలింత సగటున 6 సెకన్ల వరకూ ఉంటుంది. మనిషి సగటు జీవిత కాలంలో 400 గంటలు ఆవలించడానికే సరిపోతాయి. అది కూడా పుట్టక ముందు నుండి లెక్కిస్తారట. అంటే జీవితకాలంలో 16 నుండి 17 రోజులు ఆవలింతలకే సరిపోతాయన్నమాట.
ఇక చివరగా ఆవలింత గురించి ఓ మాట.. ఆవలింత తీసుకుంటున్న సమయంలో మన మెదడుకు ఎక్కువ ఆక్సిజన్ అవసరం అవుతుంది. సో నెమ్మదిగా ఆవలింత పనిని ఆవలింతను చేసుకోనివ్వండి. మీరైతే ఇప్పటికి ఓ 4- 5 సార్లు ఆవలించారని మాకు అర్థం అయింది లెండి. అదీ.. ఆవులింతకు ఉన్న పవర్. కనుక ఆవులింత వస్తే ఆపేందుకు యత్నించకండి. లేదంటే అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.