News Paper Dots : న్యూస్ పేపర్లను చదివే అలవాటు మీకుందా..? అయితే ఇప్పుడు చెప్పబోయే సమాచారం కూడా న్యూస్ పేపర్స్ గురించే. అంటే.. అందులో రాసే వార్తలు, ఇతరత్రా విషయాల గురించి కాదు. కానీ.. అది మనం తెలుసుకోవాల్సిన విషయమే. ఇంతకీ ఏంటా విషయం..? అంటారా..! ఏమీ లేదండీ…! న్యూస్ పేపర్లపై మీరు ఎప్పుడైనా నాలుగు కలర్ చుక్కలు లేదా అదే రంగులో ఉండే వేరే ఏవైనా సింబల్స్ చూశారా..? చూసే ఉంటారు, కానీ వాటిని పెద్దగా పట్టించుకుని ఉండరు. సహజంగా ఆ నాలుగు డాట్స్ కలర్ పేజీలపై మనకు దర్శనమిస్తాయి. అయితే.. అసలు అలా ఆ నాలుగు చుక్కలు న్యూస్ పేపర్లపై ఎందుకు ప్రింట్ అయి వస్తాయో తెలుసా..? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా మనం చిన్నపాటి ప్రింటర్‌లో ఏదైనా పేజీ ప్రింట్ తీస్తే ఆ ప్రింటర్ పేజీ సైజ్‌కి అనుగుణంగా అక్షరాలను ఒక స్టైల్‌లో, క్రమబద్దమైన కొలతలతో ప్రింట్ చేస్తుంది కదా. దాని అలైన్‌మెంట్ (అమరిక) ప్రకారం ప్రింటర్ అలా పేజీలను ప్రింట్ చేస్తుంది. అంటే.. అక్షరాలు లేదా ఫొటోలు బ్లర్‌గా రావడం లేదంటే మనం పేజీలో పెట్టిన మార్జిన్స్ కాకుండా టెక్ట్స్ అడ్డ దిడ్డంగా ప్రింట్ అవడం.. అన్నమాట. అలా రాకుండా ఉండేందుకు ఏ ప్రింటర్ అయినా ముందు అలైన్‌మెంట్ చేసుకుంటుంది. సరిగ్గా ఇదే సూత్రం న్యూస్ పేపర్ ప్రింటింగ్‌కు కూడా వర్తిస్తుంది. ఈ క్రమంలోనే ఏదైనా కలర్ పేజీలో టెక్ట్స్ లేదా ఫొటోను అలైన్‌మెంట్ ప్రకారం ప్రింట్ చేయాలంటే అందుకు పైన చెప్పిన ఆ నాలుగు డాట్స్ ఉపయోగపడతాయి.
నిజానికి ఆ నాలుగు డాట్స్ నాలుగు కలర్లలో ఉంటాయి. అవే సీఎంవైకే (CMYK). అంటే క్యాన్, మెజెంటా, ఎల్లో, బ్లాక్ అని అర్థం. ఈ నాలుగు కలర్స్ పలు రకాలుగా మిక్స్ అయి కొన్ని లక్షల సంఖ్యలో కలర్స్‌ను సృష్టిస్తాయి. అందుకే ఈ రంగులను ప్రాథమిక రంగులు అని కూడా పిలుస్తారు. ఈ క్రమంలో ఈ నాలుగు కలర్స్‌కు చెందిన చుక్కలు ఉండడం వల్ల న్యూస్ పేపర్ ప్రింటింగ్ మెషిన్లు అలైన్‌మెంట్‌ను సరిగ్గా తీసుకుని.. టెక్ట్స్, ఫొటోలను సరిగ్గా ప్రింట్ చేస్తాయి. అదే అలైన్‌మెంట్ సరిగ్గా లేదనుకోండి.. టెక్ట్స్, ఫొటోలు బ్లర్‌గా వస్తాయి. సరిగ్గా కనిపించవు. దాన్ని బట్టి మనకు సులభంగా అర్థమవుతుంది, ఆ ప్రింట్ మెషీన్ సరిగ్గా అలైన్‌మెంట్ చేసుకోలేదని.
ఒక్కో సారి మనకు అలా అలైన్‌మెంట్ సరిగ్గా చేయబడని కొన్ని పేజీలు కూడా కనిపిస్తుంటాయి కదా. అందుకు కారణం అదే. దీంతోపాటు ఆ నాలుగు డాట్స్‌ను మెషిన్లు గుర్తించి సరైన రంగులను మిక్స్ చేసేందుకు కూడా ఆ డాట్స్ ఉపయోగపడతాయి. అయితే ఇవి బుక్స్‌లలో కూడా ఉంటాయి. కాకపోతే బుక్స్‌ను చాలా తక్కువ సంఖ్యలో ప్రింట్ చేస్తారు, దానికి తోడు వాటిని బైండింగ్ కూడా చేస్తారు కనుక, ఆ నాలుగు డాట్స్ కట్ అవుతాయి. అదే న్యూస్ పేపర్లను అలా చేయలేం కదా. అందుకే ఆ నాలుగు చుక్కలను అలాగే వదిలేయడం వల్ల మనకు అవి అలా కనిపిస్తాయన్నమాట.