UAE Golden Visa : ఇప్పటి వరకు మనం చాలా మంది సెలబ్రిటీలు యూఏఈ గోల్డెన్ వీసాలు తీసుకున్న వారిని చూశాం. ఇప్పటికీ ఎవరో ఒకరు ఈ వీసాను పొందుతూనే ఉంటారు. అయితే అసలు ఇంతకీ యూఏఈ గోల్డెన్ వీసా అంటే ఏమిటి ? దీన్ని ఎవరికి ఇస్తారు ? ఎవరు పొందవచ్చు ? వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
యూఏఈ గోల్డెన్ వీసాను పలు భిన్న రకాల రంగాలకు చెందిన వారికి ఇస్తారు. బిజినెస్ చేసే వారు అయితే అక్కడి ప్రాజెక్టులో కనీసం రూ.1 కోటి పెట్టుబడి పెట్టాలి. 3 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టడంతోపాటు దాన్ని లోన్ కింద పొంది ఉండకూడదు. ఆ పెట్టుబడిని 3 ఏళ్ల పాటు వెనక్కి తీసుకోరాదు. అలాంటి వ్యాపారవేత్తలకు లేదా ఔత్సాహికులకు యూఏఈ గోల్డెన్ వీసాను ఇస్తారు.
ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఒక రేంజ్‌లో టాలెంట్ ఉన్న విద్యార్థులకు ఈ వీసాను మంజూరు చేస్తారు. విద్యార్థులు సెకండరీ స్కూల్ స్థాయిలో 95 శాతం మార్కులు వచ్చి ఉండాలి. యూనివర్సిటీ స్థాయిలో జీపీఏ కనీసం 3.75 ఉండాలి. ఇలాంటి వారికి గోల్డెన్ వీసా ఇస్తారు.
సినిమా వాళ్లకు ప్రత్యేక టాలెంట్ ఉన్న వ్యక్తుల విభాగం కింద ఈ వీసాను ఇస్తారు. తరచూ వీరు యూఏఈకి ప్రయాణం చేస్తుండడంతోపాటు సినిమా రంగంలో బాగా పాపులర్ అయి ఉండాలి. ఇలాంటి వారు దరఖాస్తు చేసుకుంటే యూఏఈ గోల్డెన్ వీసా ఇస్తారు. దీన్ని సాధారణంగా 5 లేదా 10 ఏళ్లకు ఇస్తారు. ఆ వ్యవధి ముగిశాక ఈ వీసా ఆటోమేటిగ్గా రెన్యువల్ అవుతుంది.
ఇక ఈ వీసాకు దరఖాస్తు చేసుకునేందుకు యూఏఈకి చెందిన మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ యూత్ సిఫారసు ఉండాలి. లేదా ఆ శాఖకు చెందిన విభాగానికి, అక్కడి ఫెడరల్ అథారిటీకి దరఖాస్తు చేసుకోవచ్చు. అందుకు గాను సదరు శాఖలకు చెందిన వెబ్‌సైట్లను సందర్శించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. లేదా 600522222 అనే నంబర్‌కు కాల్ చేయాల్సి ఉంటుంది.