Almonds : చాలా మంది తమ ముఖం అందంగా కనిపించాలని కోరుకుంటారు. ముఖ్యంగా మహిళలు తమ అందానికి అధిక ప్రాధాన్యతను ఇస్తారు. మీరు కూడా మీ ముఖం అందంగా మెరిసిపోవాలని కోరుకుంటే ఇప్పుడు చెప్పబోయేది మీకోసమే. మీరు బాదంపప్పును కింద తెలిపిన విధంగా ఉపయోగించండి. దీంతో మీ చర్మం మృదువుగా మారుతుంది. అలాగే ముఖ సౌందర్యం పెరుగుతుంది. ఇందుకు బాదంపప్పును ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం. బాదంపప్పులో విటమిన్లు ఎ, బి పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మం అందంగా కనిపించేలా చేస్తాయి. బాదంపప్పును ఉపయోగించడం వల్ల ముఖంపై ఉండే ముడతలు తగ్గిపోతాయి. మొటిమలు, మచ్చల నుంచి విముక్తి లభిస్తుంది.
బాదంపప్పును ముఖ సౌందర్యం పెంచడం కోసం అనేక విధాలుగా ఉపయోగించవచ్చు. రాత్రి నిద్రకు ముందు మీరు బాదంనూనెను మీ ముఖంపై అప్లై చేయండి. మీ చేతులతో సున్నితంగా మసాజ్ చేయండి. అవసరం అనుకుంటే అందులో కాస్త రోజ్ వాటర్ కూడా కలపవచ్చు. ఉదయం నిద్ర లేచిన తరువాత మీ ముఖాన్ని శుభ్రమైన నీటితో కడిగేయండి. ఇలా రోజూ చేస్తుంటే కొన్ని రోజుల్లో తప్పక మార్పును గమనిస్తారు. ఇదే కాకుండా మీరు బాదం పేస్ట్‌ను కూడా ఉపయోగించవచ్చు. ఇందుకు గాను కొన్ని బాదంపప్పును తీసుకుని మెత్తని పొడిలా చేయాలి. ఇందులో పాలు లేదా రోజ్ వాటర్ కలిపి పేస్ట్‌లా మార్చాలి. దీన్ని ముఖంపై అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాలు వేచి ఉండాలి. తరువాత చల్లని నీటితో కడిగేయాలి. దీంతో ముఖంలో కాంతి పెరుగుతుంది.
మీరు ముఖంలో కాంతి పెరగాలంటే బాదంపప్పును రోజూ నేరుగా కూడా తినవచ్చు. ఇందుకు గాను మీరు 3 లేదా 4 బాదంపప్పును పాలలో రాత్రి పూట నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆ బాదంపప్పులను తిని అనంతరం ఆ పాలను తాగాలి. దీంతో మీ ముఖంలో చెప్పుకోదగిన మార్పు కనిపిస్తుంది. మీరు ముఖ సౌందర్యం కోసం బాదం పాలను కూడా తాగవచ్చు. బాదంపాలను మీరే స్వయంగా తయారు చేసుకోవచ్చు. ఇందుకు గాను ముందుగా కొన్ని బాదంలను తీసుకుని మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. అనంతరం పాలలో వేసి కలిపి పొయ్యి మీద పెట్టి మరిగించాలి. దీంతో బాదంపాలు రెడీ అవుతాయి. వీటిని వేడిగా లేదా చల్లగా కూడా తాగవచ్చు. రోజుకు కనీసం ఒక కప్పు అయినా తాగాలి.
మీరు బాదం, పెరుగును కలిపి ఫేస్ ప్యాక్ చేసి కూడా ఉపయోగించవచ్చు. ఇందుకు మీరు ఏం చేయాలంటే.. కొన్ని బాదంలను తీసుకుని రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు గ్రైండ్ చేసి అందులో పెరుగు కలిపి ప్యాక్ తయారు చేయాలి. దీన్ని ముఖంపై అప్లై చేసి 15 నిమిషాలు ఆగాక కడిగేయాలి. ఈ మిశ్రమంలో పెరుగుకు బదులుగా మీరు ఓట్స్‌ను కూడా ఉపయోగించవచ్చు. కానీ ఓట్స్‌ను ముందుగా కొన్ని గంటల పాటు నానబెట్టాలి. ఈ విధంగా మీరు బాదంపప్పును ఉపయోగించి మీ ముఖ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. అయితే బాదంపప్పు కొందరికి అలర్జీలను కలగజేస్తుంది. కనుక ముందుగా ప్యాచ్ చేసుకోవాలి. అలర్జీ రావడం లేదు అని భావిస్తేనే బాదంపప్పును ఉపయోగించాలి. లేదంటే ఇబ్బందుల్లో పడిపోతారు.